అన్నదాతలకు మద్దతుగా బంద్... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు - Bharat Bandh Updates
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్రంలో భారత్ బంద్ కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
బంద్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
By
Published : Dec 8, 2020, 9:09 AM IST
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతులు నిరసన ఇవాళ దేశమంతటికీ వ్యాపించింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన రైతులకు సంఘాలకు భారీగా మద్దతు లభిస్తోంది. ఉదయం మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్‌బంద్ చేపట్టేందుకు రైతు సంఘాలతో పాటు మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలు, వ్యాపార, వాణిజ్య రంగాలు సిద్ధమయ్యాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే బంద్ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమతమయ్యాయి. తెల్లవారుజాము నుంచే అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల ముందు తెరాస, కాంగ్రెస్, వామపక్ష నేతలు నిరసనకు దిగారు.
బంద్‌కు అధికార పార్టీ తెరాసతో పాటు... కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు రహదారుల దిగ్బంధంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ బంద్‌కు మద్దతుగా కూకట్‌పల్లిలో జాతీయరహదారిని దిగ్బంధించిన తెరాస శ్రేణులు... అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ జాతీయరహదారిపై పడుకుని నిరసన తెలిపారు.
మహబూబ్‌నగర్ డిపో ఎదుట ధర్నాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో ఎదుట తెరాస, కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నిరసనలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. కల్వకుర్తి డిపో ఎదుట ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో ఎదుట ఎమ్మెల్యే చందర్ నిరసన తెలిపారు. రైతులకు మద్దతు ప్రకటించిన శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి కార్మికులు... నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.