తెలంగాణ

telangana

ETV Bharat / state

శనగ, వేరుసెనగలకైనా రాయితీ ఇవ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు - రబీ సీజన్​ పంటలు లేటెస్ట్​ వార్తలు

విత్తన ధరలు భారీగా పెరిగిపోతున్నందున తెలంగాణలో రబీ సీజన్​లో రెండు ప్రధాన పంటలైన శనగ, వేరుసెనగలకు విత్తన రాయితీ ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వానాకాలంలో రాయితీ ఇవ్వనందున ఈ సీజన్‌లోనూ అదే ఆనవాయితీ కొనసాగిస్తే రైతులపై భారం పడనుంది.

Proposals to the government to subsidize peanuts and groundnuts crop
శనగ, వేరుసెనగలకైనా రాయితీ ఇవ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు

By

Published : Oct 2, 2020, 6:29 AM IST

రాష్ట్రంలో ఈ యాసంగి (రబీ) సీజన్‌లో రెండు ప్రధాన పంటలకు విత్తన రాయితీ ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో సోయా విత్తనాలకు తప్ప వేరే వాటికి రాయితీ లేనందున రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విత్తన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని పంటలకూ కాకపోయినా శనగ, వేరుసెనగ విత్తనాలకైనా రాయితీ ఇవ్వాలని వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ప్రతిపాదించింది. గతేడాది వరకూ అన్ని పంటలకు రాయితీ ఉండేది. యాసంగి సీజన్‌ ప్రారంభమైనందున విత్తన రాయితీపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటనేది వెలువడాల్సి ఉంది.

అందుబాటులో 20.49 లక్షల క్వింటాళ్లు

యాసంగిలో అన్ని ప్రధాన పంటల విత్తనాలు 15.56 లక్షల క్వింటాళ్లు అవసరమని 20.49 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. వరి విత్తనాలు 15 లక్షల క్వింటాళ్లు, శనగ 1.73 లక్షలు, వేరుసెనగ 1.44 లక్షలు, మొక్కజొన్న లక్ష క్వింటాళ్లు ఉన్నట్లు వివరించింది. వేరుసెనగ పంట సాగుకు 2.97 లక్షల క్వింటాళ్లు అవసరం. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌) వద్ద 1.44 లక్షల క్వింటాళ్లే ఉన్నాయి. మిగతావాటిని రైతులు సొంత పంట నుంచి వాడుకుంటారని కొరత రాదని వ్యవసాయశాఖ అంచనా.

రాయితీ లేకపోతే వేరుసెనగ ధర దాదాపు రెట్టింపు

క్వింటా వేరుసెనగ విత్తనాల ధరను రూ.8,400గా టీఎస్‌ సీడ్స్‌ ఖరారు చేసింది. గతేడాది(2019) అక్టోబరులో రూ.7,100గా నిర్ణయించి అందులో 35 శాతాన్ని అంటే రూ.2,485 ప్రభుత్వం రాయితీగా ఇచ్చింది. రైతులు రాయితీ పోను రూ.4,615 చెల్లించి కొన్నారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోతే రైతులు రూ.8,400 చెల్లించి విత్తనాలు కొనాలి. శనగ ధర గతేడాది రూ.6,500 కాగా ఇందులో 35 శాతం(రూ.2,275) ప్రభుత్వం రాయితీగా నిర్ణయించింది. ఈ ఏడాది రూ.6,800గా నిర్ణయించారు. ఈ రెండు పంటలకు 30 శాతం రాయితీ ఇవ్వాలని తాజాగా వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ప్రతిపాదించింది. వానాకాలంలో రాయితీ ఇవ్వనందున ఈ సీజన్‌లోనూ అదే ఆనవాయితీ కొనసాగిస్తే రైతులపై భారం పడనుంది. యాసంగిలో వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో శనగ, వేరుసెనగ పంటలనే రైతులు సాగు చేస్తారు.

పునరుద్ధరిస్తే రైతుకు మేలు

వరి విత్తనాలపై గతేడాది వరకూ క్వింటా ధర ఎంత ఉన్నా అందులో రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. ఈ ఏడాది వానాకాలంలో దాన్ని రద్దు చేయడంతో ఇక ఈ సీజన్‌లో వ్యవసాయశాఖ కూడా దాని గురించి ప్రభుత్వాన్ని అడగలేదు. యాసంగిలో 10 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను రైతులు కొంటారని వ్యవసాయశాఖ అంచనా. క్వింటాకు రూ.వెయ్యి చొప్పున రాయితీని ప్రభుత్వం పునరుద్ధరిస్తే కర్షకులకు రూ.100 కోట్లకు పైగా భారం తగ్గుతుంది.

ఇదీ చదవండిఃరాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భజలమట్టం

ABOUT THE AUTHOR

...view details