National Highways in Telangana : తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో సుమారు రూ.40 వేల కోట్ల మేర రహదారి విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్రం చేపడుతున్న భారత్ మాల-2 పథకం కింద రూ.25 వేల కోట్లు, ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద మరో రూ.15 వేల కోట్ల విలువ చేసే పనులు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 1,575 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణకు సంబంధించి తెలంగాణ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలన తుది జాబితాలో చేరినట్లు సమాచారం. ఇందులో 1000 కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి కేంద్రం సూచించినట్లు తెలిసింది.
భారత్‌మాల-2లో ప్రాంతీయ రింగ్ రోడ్డు రెండో దశ :ఆర్‌ఆర్‌ఆర్ మొదటి దశ భూ సేకరణ నిధుల విడుదల పీటముడి వీడనప్పటికీ.. రెండో దశను భారత్ మాల-2లో చేర్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాదాపు 187 కిలో మీటర్ల మేర ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని ఆ పథకం కింద మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. తుది జాబితాలో చేర్చినప్పటికీ ఉత్తర భాగంలో భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేశాకే.. దక్షిణ భాగానికి అనుమతి ఇవ్వడంతో పాటు సవివర నివేదికకు ఆమోద ముద్ర వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మరో నాలుగు మార్గాలను ఈ పథకంలో చేర్చాలన్న ప్రతిపాదనలకు త్వరలో ఆమోదం లభించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీఎం గతిశక్తి స్కీమ్ కింద మంచిర్యాల-విజయవాడ, హైదరాబాద్-రాయ్‌పుర్, హైదరాబాద్-బెంగళూరు మార్గంలో తెలంగాణ సరిహద్దు వరకు విస్తరణ పనులు కూడా కేంద్రం మంజూరు చేయనుంది.