మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ విత్తన కంపెనీ తెలంగాణ రైతులకు అమ్మకానికి పెట్టిన సోయా విత్తన బస్తాల్లో ఇదొకటి. 30 కిలోల ధర రూ.3,360గా ముద్రించడాన్ని ఎరుపు రంగు వృత్తంలో చూడవచ్చు. వీటిని రాయితీపై రూ.1,718కే ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ విత్తనాలు లేవని చెప్పి రూ.3,360కి అమ్మేస్తున్నారు.
రెండు నెలల క్రితమే వ్యవసాయశాఖ తరఫున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్ సీడ్స్) టెండర్లు పిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఎక్కువగా ఈ విత్తనాల ఉత్పత్తి ఉంటుంది. సాధారణంగా కంపెనీలు అక్కడ కొని తెచ్చి ఇక్కడ సరఫరా చేస్తాయి. కొరత ఉన్నందున ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం వాటికి కలిసొచ్చింది. ఆ ఉత్తర్వును సాకుగా చూపి తెలంగాణకు సరఫరా చేయలేం అని విత్తన కంపెనీలు విత్తనాభివృద్ధి సంస్థకు తేల్చి చెప్పాయి. గత నెల 20న జారీచేసిన ఆ ఉత్తర్వు ఆధారంగా ఇప్పుడు విత్తనాలు సరఫరా చేయలేం అని చెప్పడం ఇక్కడి రైతులను మోసం చేయడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మార్చిలోనే టెండర్లు, ఒప్పందాలు జరిగిపోయాయి. విత్తనాల లభ్యత చూసుకునే కంపెనీలు టెండర్లు వేయాలి.
కీలక సమయలో చేతులెత్తేసిన కంపెనీలు
ఈ ఏడాది లక్షా 40 వేల క్వింటాళ్లు సోయా విత్తులు కొనడానికి టీఎస్ సీడ్స్ టెండర్లు పిలిచి ధరలు ఖరారు చేసింది. మే 15 కల్లా విత్తనాలు జిల్లాలకు సరఫరా చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. తీరా గడువు దగ్గర పడిన తర్వాత తమ వద్ద విత్తనాలు లేవని పలు కంపెనీలు చేతులెత్తేశాయి. 3 కంపెనీలు మాత్రమే 7 వేల క్వింటాళ్లు ఇస్తామని చెప్పాయి. లక్షా 40 వేల క్వింటాళ్లు అవసరమైనందున 7 వేల క్వింటాళ్లే జిల్లాలకు పంపితే వీటి కోసం రాజకీయ ఒత్తిళ్లతో పాటు రైతులు నిరసనలకు దిగే ప్రమాదముందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో సోయా విత్తనాలకు రాయితీ ఇవ్వడం లేదని, బయటి మార్కెట్‌లో కొనుక్కోవాలని రైతులకు అధికారికంగా చెబితే మేలని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది.