తెలంగాణ

telangana

ETV Bharat / state

PROPERTY TAX: విలువ ఆధారంగా ఆస్తిపన్ను.. కొత్త విధానం అమలుపై కసరత్తు - property tax latest news

రాష్ట్రంలో పురపాలక సంఘాలు , నగర పాలక సంస్థల్లో ఆస్తి పన్ను మదింపు విధానంలో మార్పులకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను విధానం స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అద్దె ప్రాతిపదికగా ఆస్తి పన్ను మదింపు విధానం అమల్లో ఉండగా కొత్త ఉత్తర్వుల మేరకు నివాస స్థలం, భవనం విలువ ఆధారంగా ఆస్తిపన్ను లెక్కించనున్నారు. తాజా మార్పుల మేరకు ఆస్తిపన్ను కనిష్ట, గరిష్ట పరిమితులను ప్రభుత్వం నిర్ణయించగా ఈ పరిమితిలో ఆస్తిపన్ను మొత్తాన్ని నిర్ణయించే స్వేచ్ఛను పురపాలక సంఘానికి ప్రభుత్వం కల్పించింది.

PROPERTY TAX:  విలువ ఆధారంగా ఆస్తిపన్ను.. కొత్త విధానం అమలుపై కసరత్తు
PROPERTY TAX: విలువ ఆధారంగా ఆస్తిపన్ను.. కొత్త విధానం అమలుపై కసరత్తు

By

Published : Sep 3, 2021, 4:13 AM IST

Updated : Sep 3, 2021, 7:00 AM IST

రాష్ట్రంలో పురపాలక శాఖ ఆస్తిపన్ను మార్పులపై కసరత్తు చేస్తోంది. తాజా విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ భూములు, వ్యవసాయేతర ఆస్తుల విలువలను పెంచే మేరకు ఆస్తిపన్ను సైతం పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ విలువలను సవరించకుంటే ప్రతి రెండేళ్లకు ఐదు శాతం ఆస్తిపన్ను పెంచే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చింది. గతేడాది డిసెంబరు 11 న పురపాలక శాఖ ఇచ్చిన జీవో 280 మేరకు జీహెచ్​ఎంసీ మినహా మిగిలిన నగరపాలక సంస్థలు , 141 పురపాలక సంఘాల్లో కొత్త ఆస్తి పన్ను విధానం అమలుకు వీలుగా పురపాలకశాఖ ప్రాథమిక కసరత్తు చేస్తోంది . కొత్త విధానంలో ఎంత ఆస్తిపన్ను పెరుగుతుందనే అంశాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు . వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నును ప్రస్తుతం నిర్ణయిస్తున్నారు. భవనం ఎన్నేళ్ల క్రితం అనే దాని మేరకు ఆస్తిపన్నులో తగ్గింపు ఉంటుంది . రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువను ఆస్తిపన్ను మదింపునకు పరిగణనలో తీసుకుంటారు. భూముల విలువ , ఆస్తుల విలువ పెరుగుదల ప్రాతిపదికగా ఆస్తి పన్ను మొత్తం కూడా పెరుగుతుంది .

75 చదరపు గజాల్లోపు ఉంటే రూ.100

పురపాలక చట్టం -2019 మేరకు ఆస్తిపన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 75 చదరపు గజాలు విస్తీర్ణంలో ఉన్న భవనం , గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు ఉంటే ఆ భవనానికి ఆస్తిపన్నును 100 రూపాయలుగా ఉంటుంది. వాణిజ్య భవనాలకు 0.25 శాతం నుంచి రెండు శాతం వరకు ఆస్తి పన్ను విధిస్తారు . నివాసభవనాలకు 0.10 శాతం నుంచి ఒకశాతం, ఖాళీ స్థలాలపై కనిష్టంగా 0.05 శాతం , గరిష్టంగా 0.20 శాతం విలువలో కనిష్టంగా 0.05 శాతం , గరిష్టంగా 0.20 శాతం చెల్లించాల్సి ఉంటుంది . ఒక స్థలంలో నిర్మాణం కాకుండా మిగిలి ఉన్న ఖాళీ స్థలానికి పన్ను వర్తిస్తుంది. నిర్మాణ సమయం లేదా రిజిస్ట్రేషన్ సమయంలో ఖాళీ స్థలం పన్నును నిర్దేశించిన మేర చెల్లించాల్సి ఉంటుంది . నిర్మాణానికి ముందు నో డ్యూ సర్టిఫికెట్ అందచేయాల్సి ఉంటుంది . రెండేళ్లకోసారి మార్కెట్ విలువల సవరణ ప్రకారం ఆస్తిపన్నును సవరించే అధికారం పురపాలక కమిషనర్లకు ఉంటుంది . కొత్త ఆస్తి పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశాన్ని పురపాలక కమిషనర్ నోటిపై చేయాల్సి ఉంటుంది . వీటికి సంబంధించి పురపాలక సంఘం ప్రత్యేక రిజిస్టర్​ను నిర్వహించాల్సి ఉంటుంది.

మినహాయించినవి ఇవి

ప్రార్థనా మందిరాలు , దాతృత్వ కార్యక్రమాలు వినియోగించే స్థలాలు , అనాథ , వృద్ధాశ్రమాలు , జంతు సంరక్షణ కేంద్రాలు , గ్రంథాలయాలు , ఆటస్థలాలు , పురాతన , చారిత్రక, స్మారక కట్టడాలు, ఆస్పత్రులు , వైద్యశాలలు , శ్మశాన వాటికలు , పురపాలక భవనాలు , స్థలాలు , సైనికులు , మాజీ సైనికులకు చెందిన నివాసభవనాలు , ఉంటేనే మినహాయింపు వర్తిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై 25 రెట్ల ఆస్తిపన్నును జరిమానాగా విధిస్తోంది. ఆస్తిపన్ను మదింపు కొత్త విధానానికి అమలుపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

ఇప్పటికే కొన్నా అమల్లోకి..

జీవో 230లోని కొన్ని కీలక అంశాలను ఇప్పటికే పురపాలకశాఖ అమలు చేస్తోంది. స్వీయ ధ్రువీకరణ విధానంలో ఆస్తిపన్ను మదింపు , నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై జరిమానాలతో పాటు ఇతర చర్యలను పురపాలకశాఖ ఇప్పటికే తీసుకుంటోంది . ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై 25 రెట్ల ఆస్తిపన్నును జరిమానాగా విధిస్తోంది.

ఇదీ చదవండి: EXCISE DEPARTMENT: అస్తవ్యస్తంగా ఆబ్కారీ పాలనా వ్యవస్థ.. పోస్టింగ్‌లపై కోల్డ్​వార్​!

Last Updated : Sep 3, 2021, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details