తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివారం.. ఆస్తిపన్ను పరిష్కార మేళా! - జీహెచ్​ఎసీ వార్తలు

ఆస్తిపన్నుపై ఫిర్యాదులు, ఆస్తిపన్ను మదింపు, కోర్టు కేసుల పరిష్కారం తదితర అంశాలపై ప్రతి ఆదివారం నగరంలోని అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో ఆస్తిపన్ను పరిష్కార మేళాను నిర్వహించనున్నట్లు జీహెచ్​ఎంసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లు, బల్దియా రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొంటారు. చాలా సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను చక్కదిద్దుకునేందుకు ఇది చక్కని అవకాశం.

ghmc office
ghmc office

By

Published : Jan 23, 2021, 10:12 AM IST

ఆస్తిపన్నుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పౌరులు తమ సమస్యను సంబంధిత సర్కిల్‌ కార్యాలయాల్లో జనవరి 24 నుంచి మార్చి 28 వరకు ఆదివారం రోజున జరిగే ‘పరిష్కార మేళా’ దృష్టికి తీసుకెళ్లాలని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌ శుక్రవారం ప్రకటించారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యంత్రాంగమంతా ఒకేచోట కూర్చుని పరిష్కార ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తుందన్నారు. పౌరులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు అధికారులు అందుబాటులో ఉంటారని లోకేష్‌కుమార్‌ స్పష్టం చేశారు.

సర్కిల్‌ కార్యాలయాల్లో..

ఆస్తిపన్నుపై ఫిర్యాదులు, ఆస్తిపన్ను మదింపు, కోర్టు కేసుల పరిష్కారం తదితర అంశాలపై ప్రతి ఆదివారం నగరంలోని అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో ఆస్తిపన్ను పరిష్కార మేళా నిర్వహిస్తున్నాం. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లు, బల్దియా రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొంటారు. చాలా సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను చక్కదిద్దుకునేందుకు ఇది చక్కని అవకాశం. తక్కువ విస్తీర్ణానికి ఎక్కువ పన్ను విధించడం, భారీ భవంతులకు తక్కువ పన్ను ఉండటం, ఆస్తిపన్ను మదింపు సవ్యంగా జరగకపోవడం, యజమాని పేరు లేదా ఇంటి నంబరులో దోషం ఉండటం వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారు. అందుకు సంబంధించిన దస్త్రాలు పౌరులు తీసుకెళ్లాలి. వాటిని పరిశీలించి అధికారులు నిర్ణయం తీసుకుంటారు.’’అని కమిషనర్‌ తెలిపారు. జనవరిలోని 34, 31 తేదీల్లో, ఫిబ్రవరిలోని 7, 14, 21, 28 తేదీల్లో, మార్చి 7, 14, 21, 28 తేదీల్లో మేళా జరుగుతుందని వెల్లడించారు. రివిజన్‌ పిటిషన్లను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యముంటుందని లోకేష్‌కుమార్‌ తెలిపారు.

లోపాలను సరిదిద్దడం ద్వారా ఆదాయం..

‘‘అపరిష్కృత పన్ను వివాదాలతో చాలా మంది బకాయిలు చెల్లించేందుకు ఇష్టపడట్లేదు. అలాంటి మొండి బకాయిలు ప్రస్తుతం రూ.1 వెయ్యి కోట్లకు పైగా ఉంది. పౌరుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1900 కోట్ల పన్ను వసూలు చేయాలనేది లక్ష్యం. మార్చి నెలాఖరుతో గడువు ముగుస్తున్నందున వసూళ్లను పెంచేందుకు సర్కిళ్ల కమిషనర్లకు రోజువారీ, నెలవారీ లక్ష్యాలు ఇచ్చాం. పన్ను విలువ పెంచకుండా, పకడ్భందీ మదింపుతో ఆదాయం పెంచుకునేలా ముందుకెళ్తున్నాం.’’అని జీహెచ్‌ఎంసీ వివరించింది.

ఇదీ చదవండి :అసహజ బంధానికి పెద్దలు నిరాకరణ.. యువతి బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details