Promotions Telangana Excise Department : రాష్ట్రంలోని పలు శాఖల్లో పదోన్నతులకు జాప్యం జరుగుతోంది. పదోన్నతుల కోసం మూడువేల మందికి పైగా అధికారులు, పదివేల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నిబంధనల మేరకు ఏటా సెప్టెంబరు మొదటి తేదీ నుంచి తదుపరి ఏడాది ఆగస్టు 31 వరకు డీపీసీ సమావేశాలు జరుగుతాయి. ఒక పోస్టుకు ఇద్దరు చొప్పున రూపొందించే జాబితాను ప్రభుత్వం పరిశీలించి పదోన్నతులకు ఎంపిక చేస్తుంది.
ఆ తర్వాత ఏడాదిలోగా వారిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించాలి. నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు డీపీసీలతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం శాఖాపరమైన అవసరాల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున ప్రమోషన్లు ఇచ్చింది. ఎక్కువ మందికి ప్రయోజనం దక్కేందుకు ఉద్యోగుల కనీస సర్వీసు పరిమితిని రెండేళ్లకు తగ్గించింది. ఆ తర్వాత పదోన్నతులు పెరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 2020, 2021లలో జనవరి నుంచి మార్చి వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టగా... 40 వేల మందికి పదోన్నతులు లభించాయి. 2021 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచడంతో ఈ ప్రక్రియలో కొంత మేర ప్రతిష్టంభన ఏర్పడింది.
ఖాళీలుంటేనే..:పదవీ విరమణ వయసు పెంపు కారణంగా 2021 ఏప్రిల్ తర్వాత ఖాళీల సంఖ్య తగ్గింది. రాజీనామాలు, మరణాలు, స్వచ్ఛంద ఉద్యోగ విరమణలతో ఖాళీ అయిన పోస్టులను పదోన్నతులతో భర్తీ చేస్తున్నారు. గతంలో ఒక్కో డీపీసీ జాబితాలో 50 నుంచి వంద వరకు జాబితాలు ఉండగా.. 2021 తర్వాత అది అయిదు లేదా పది పోస్టులకే పరిమితమవుతోంది. స్పష్టమైన ఖాళీల ప్రాతిపదికన మాత్రమే డీపీసీలు నిర్వహించడం వల్ల అర్హులందరికీ అవకాశం రావట్లేదు. కొన్నిచోట్ల సీనియారిటీపరమైన అంశాలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలుండడంతో జాప్యమవుతోంది. కొన్ని శాఖల్లో పదోన్నతుల ద్వారా భర్తీ కావాల్సిన పోస్టులను తాజాగా చేపట్టిన నియామకాల్లో చేర్చడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.