తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.3 వేల కోట్లతో ప్రాజెక్టులు.. 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించేలా చర్యలు!

Irrigation Projects in TS: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు బ్యారేజీలు, ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. రూ. 3 వేల కోట్లతో.. 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు పనులు చేపట్టనుంది. వీటిలో రెండు ప్రభుత్వానికి ఆమోదం కోసం రాగా, మరొక దానిపై కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌ అధ్యయనం చేస్తోంది.

Irrigation Projects in TS
రూ.3 వేల కోట్లతో ప్రాజెక్టులు

By

Published : Jan 12, 2022, 10:14 AM IST

Irrigation Projects in TS: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరందించే పనులను సుమారు రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టనుంది. ఇందులో రెండు బ్యారేజీలు, ఒక ఎత్తిపోతల పథకం ఉన్నాయి. వీటిలో రెండు ప్రభుత్వానికి ఆమోదం కోసం రాగా, మరొక దానిపై కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌ అధ్యయనం చేస్తోంది. కడెం ప్రాజెక్టు కింద 68,150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు స్థిరీకరణ కోసం ఈ ప్రాజెక్టుకు 50 కి.మీ ఎగువన ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కుప్తి గ్రామం వద్ద కడెం నదిపై ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.794.33 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చింది. 5.32 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు ఏడు గేట్లు ఉంటాయి. రెండు గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీనిపై అధ్యయనం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి సాంకేతిక అనుమతి రాగానే టెండర్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ డ్యామ్‌ నిర్మాణ ప్రతిపాదన ఉండగానే దీనినుంచి బోథ్‌, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో 15,405 ఎకరాల ఆయకట్టుకు 1.25 టీఎంసీల నీటిని వాడుకొనేలా ఎత్తిపోతలకు ప్రతిపాదన సిద్ధం చేశారు. దీనికి రూ.477 కోట్లు వ్యయం కావొచ్చని అంచనా వేశారు.

చెన్నూరుకు ఎత్తిపోతల

ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పునరాకృతిలో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతలను చేపట్టిన ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును ఉమ్మడి ఆదిలాబాద్‌కు పరిమితం చేసింది. దీనికింద 56 వేల ఎకరాలకు బదులు 2లక్షల ఎకరాలకు నీరివ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో మార్పు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌వాటర్‌ ద్వారా 3ఎత్తిపోతల పథకాలు చేపట్టి కొంత ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ఈ ప్రతిపాదన సిద్ధం చేశారు. సుందిళ్ల బ్యారేజీ నుంచి జైపూర్‌, బీమారం, మందమర్రి మండలాల్లో 50వేల ఎకరాలకు, అన్నారం బ్యారేజీ నుంచి చెన్నూరు, అన్నారం మండలాల్లో 60 వేల ఎకరాలకు, మేడిగడ్డ బ్యారేజీ నుంచి కోటపల్లి మండలంలో 25 వేల ఎకరాలకు ఇవ్వాలన్న ప్రతిపాదనతో సర్వే చేసి నివేదిక తయారుచేయడానికి రూ.5.4 కోట్లతో 2020 జులైలో కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ 67,979 ఎకరాలను గుర్తించడంతో పాటు మూడు ఎత్తిపోతలకు సర్వే, ప్రధాన కాలువ ఎలైన్‌మెంట్‌ పూర్తి చేసింది. ఈ పనులకు రూ.1500 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

బ్యారేజీ స్థలం మార్పు

ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని తొలుత ప్రతిపాదించారు. 152 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టంతో మొదట ప్రతిపాదించగా ముంపు కారణంగా మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో 148 మీటర్లకు తగ్గించారు. దీన్ని తుమ్మిడిహట్టి వద్ద కాకుండా.. ఎగువన వార్ధా నదిపై నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇక్కడ 157 మీటర్ల ఎఫ్‌.ఆర్‌.ఎల్‌తో నిర్మించడానికి అవకాశం ఉందని, 2.5 టీఎంసీలు నిల్వ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త బ్యారేజీ వద్ద వార్ధా, పెన్‌గంగ ద్వారా 58 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, నిర్మాణానికి సుమారు రూ.800 కోట్లు ఖర్చు కావచ్చని ప్రాథమిక అంచనా.

ఇదీ చూడండి:Car into sagar right canal: విషాదం.. ఎమ్మెల్యే సోదరుడి భార్య, కుమార్తె మృతి

ABOUT THE AUTHOR

...view details