మనం తినే బియ్యం, వాడే కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల పంటలపై చల్లుతున్న 27 రకాల రసాయన పురుగుమందులపై వేటు పండింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ తాజాగాఉత్తర్వులు జారీ చేసి... చట్ట ముసాయిదాను విడుదల చేసింది. ఈ పురుగుమందులన్నీ పలు పంటలపై ఏళ్ల తరబడి వాడుతున్నవే కావడం గమనార్హం. వీటిని ఎందుకు నిషేధిస్తున్నారో తెలిపే వివరాలనూ కేంద్రం వెల్లడించింది. ఆ సమాచారాన్ని బట్టి మనిషి ఆరోగ్యాన్ని అవి ఎంతగా నాశనం చేస్తాయో స్పష్టమవుతుంది.
నిషేధిత జాబితాలోని కొన్నింటిని పరిశీలిస్తే..
మోనోక్రోటోఫాస్: అత్యంత విషపూరితమైన ఈ పురుగుమందును రైతులు విరివిగా పంటలపై చల్లుతున్నారు. ఈ మందు ప్యాకెట్లపై ఎరుపు రంగు ప్రమాదకర సంకేతం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ప్రమాదకర సంకేతాల కేటగిరీలో ఇది ఉంది. దీన్ని అనాలోచితంగా వాడడం వల్ల రైతులు ప్రాణాలను కోల్పోయిన దాఖలాలున్నాయి. తేనెటీగలు, పక్షులు, చేపలు, రొయ్యలపైనా ప్రభావం చూపుతోంది. ప్రజలు కొంటున్న కూరగాయలపై ఈ మందు రసాయన అవశేషాలుంటున్నాయి. దీని విషపూరిత ప్రభావం ఎలా ఉంటుందనే సమాచారాన్ని కంపెనీలు కేంద్రానికి సరిగా ఇవ్వలేదు. ఈ మందు చల్లాక వరి, మొక్కజొన్న, మినుము, పెసర, కందులు, సెనగ, చెరకు, పత్తి, కొబ్బరి, కాఫీ, కొత్తిమీర పైరును ఎన్నిరోజుల దాకా కోయకూడదనే సమాచారాన్నీ ఇవ్వలేదు. దీనివల్ల ఈ పురుగుమందు చల్లిన వెంటనే రైతులు పంట కోసి మార్కెట్లకు తేవడం వల్ల వాటిపై రసాయన అవశేషాలుంటున్నాయి. వాటిని వినియోగించే మనుషులు రోగాలపాలవుతున్నారు. ఈ మందును ఇప్పటికే 112 దేశాల్లో నిషేధించారు.
క్వినాల్‌ఫాస్:ఈ రసాయన పురుగుమందును జొన్న, మిరప, పత్తి తదితర పంటలపై చల్లుతున్నారు. ఇది అత్యంత విషపూరితమైందంటూ 30 దేశాల్లో నిషేధించారు. శ్వాసకోశ సమస్యలను సృష్టిస్తుందని ఐరోపా దేశాలు దీన్ని కేటగిరీ 1 జాబితాలో పెట్టాయి. మిరపపై తెగుళ్లను అరికట్టే శక్తి దీనికి ఎంత ఉందనే వివరాలను సైతం కంపెనీలు ఇవ్వలేదు. కానీ రైతులకు అమ్ముతున్నారు. వారు చల్లుతున్నారు.