Atluri Rama Mohana Rao: అట్లూరి రామమోహనరావు ఏపీ కృష్ణా జిల్లా పెదపారుపూడిలో.. సీతారామయ్య, రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. వానపాముల గ్రామ హైస్కూలులో రామోజీరావుతో కలిసి చదువుకున్నారు. గుడివాడలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం కర్ణాటకలోని కోసగి, కృష్ణా జిల్లా ఉంగుటూరు, పెదపారుపూడి మండలం వానపాములలో సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందించారు.
16 ఏళ్లపాటు బోధన వృత్తిలో కొనసాగి వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. వారిలో క్రమశిక్షణ, నిబద్ధతను నూరిపోశారు. బాల్య స్నేహితుడు రామోజీరావు పిలుపు మేరకు రామమోహనరావు ఉపాధ్యాయ వృత్తిని వదిలి 1974లో ఈనాడులో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. 1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 1982లో ఎండీగా పదోన్నతి పొంది.. 1995 వరకు ఆ పదవిలో కొనసాగారు.
ఫిల్మ్‌సిటీ నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకున్నారు. 1995లో ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టి, సుదీర్ఘ కాలం పనిచేశారు. రామోజీరావు సూచనలకు అనుగుణంగా రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణంలో రాత్రీ పగలూ తేడా లేకుండా పని చేశారు. చిన్నప్పుడు తనతోపాటు చదువుకున్న స్నేహితులంటే రామమోహనరావుకు ప్రాణం. ఈనాడు, ఫిల్మ్‌సిటీలలో పెద్ద హోదాల్లో విధులు నిర్వహించినా బాల్య స్నేహితులతో తరచూ మాట్లాడుతుండే వారు.
తీరిక లేకపోయినా వీలుచేసుకుని మరీ కలుసుండేవారని.. ఆయన చిన్ననాటి స్నేహితుడు ప్రొఫెసర్ పి.సత్యనారాయణ చెప్పారు. మిత్రులను ప్రాణంగా చూసుకుంటారనడానికి రామోజీరావు, రామమోహనరావుల స్నేహమే నిదర్శనమని చెప్పారు. క్రమశిక్షణ, నిబద్ధతలతో వ్యవహరించేవారన్నారు. ఎంత ఎదిగినా సాధారణంగా జీవించాలని.. డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దనీ స్నేహితులకు చెప్పేవారని తెలిపారు.