తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగం నుంచి ప్రొ. సాయిబాబా తొలగింపు - తెలంగాణ వార్తలు

అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిబాబాను రామ్​లాల్ ఆనంద్ కళాశాల ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై ఆయన భార్య తీవ్రంగా స్పందించారు. ఈ చర్య అనైతికం, అక్రమమని వసంత ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

professor saibaba job, professor saibaba wife vasantha
ప్రొఫెసర్ సాయిబాబా ఉద్యోగం తొలగింపు, ప్రొఫెసర్ సాయిబాబా తాజా వార్తలు

By

Published : Apr 4, 2021, 6:40 AM IST

నాగ్‌పుర్‌ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సాయిబాబాను... రామ్‌లాల్‌ ఆనంద్‌ కళాశాల ఉద్యోగం నుంచి తొలగించింది. మార్చి 31తో ఆయన సేవలకు ముగింపు పలికింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన భార్య వసంతకు మెమోరాండం పంపింది. మూడు నెలల జీతాన్ని సాయిబాబా ఖాతాలో జమచేసినట్టు అందులో పేర్కొంది. ఈ చర్య అనైతికం, అక్రమమని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘

కళాశాల నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తాం. మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ సాయిబాబాపై 2014లో ఆరోపణలు మోపారు. 2017లో సెషన్స్‌ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీన్ని సవాలుచేస్తూ నాగ్‌పుర్‌లోని హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించాం. ఈ విషయంలో తుది తీర్పు రాకముందే కళాశాల యాజమాన్యం తీవ్ర చర్యలు తీసుకోవడం అన్యాయం. 2014లో సాయిబాబా సస్పెండ్‌ అయినప్పట్నుంచి మాకు సగం జీతమే ఇస్తున్నారు. వాటిపై ఆధారపడి నేను, నా కుమార్తె జీవిస్తున్నాం. ఆయన్ను ఎప్పుడెప్పుడు ఉద్యోగం నుంచి తొలగిద్దామా అని కళాశాల యాజమాన్యం ప్రయత్నిస్తూ వచ్చింది. గతంలో పలుమార్లు నోటీసులు ఇస్తే... హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని తెలియజేశాం. సాయిబాబాపై క్రమశిక్షణ చర్యలకు ఏకసభ్య కమిషన్‌ నియమించినప్పుడు మేం వ్యతిరేకించాం. ఆ కమిటీలో మరికొందరిని చేర్చారు. సరిగా బోధించనప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కళాశాల పాలకమండలి సమావేశంలో క్రమశిక్షణ చర్యల అంశం వీగిపోయింది. పార్లమెంటుపై దాడి కేసులో ఎస్‌ఏఆర్‌ గిలానీకి తొలుత మరణశిక్ష విధించారు. తర్వాత దిల్లీ హైకోర్టు ఆయన నిర్దోషి అని తేల్చింది. గిలానీ మళ్లీ విధుల్లో చేరారు.

-వసంత, సాయిబాబా భార్య

విచారణలో ఎన్నో లోపాలున్నాయి...

సాయిబాబాపై చేపట్టిన విచారణల్లో అనేక లోపాలున్నాయని ఆమె అన్నారు. ఆయనకు కనీసం ఏ అంశాల్లో విచారణ చేపడుతున్నారన్నది తెలియజేయలేదని పేర్కొన్నారు. సాయిబాబాను కలవకుండా, ఆయనతో చర్చించకుండా, ఆయన సమాధానం తెలుసుకోకుండా... నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అని ఆమె ప్రశ్నించారు. కాగా.. సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని దిల్లీ టీచర్స్‌ యూనియన్‌, రామ్‌లాల్‌ ఆనంద్‌ కళాశాల సిబ్బంది ఖండించాయి.

ఇదీ చదవండి:సెగలు పుట్టిస్తున్న సాగర్ ఉప ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details