రాష్ట్రవ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి గల పరిశోధన కేంద్రాల్లో గతేడాది విత్తన పంటలుగా సాగు చేసిన నాణ్యమైన విత్తనాలను ఈ నెల 15 తర్వాత రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేసింది. వీటిని ఇప్పుడు ఒకసారి రైతులు కొంటే వరసగా 3 సీజన్లలో 3 పంటలుగా అవే విత్తనాల నుంచి సాగు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పుడు కొన్న రైతులు వచ్చేనెల నుంచి ప్రారంభమవుతున్న కొత్త వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో తొలిసారి విత్తనాలు నాటాలి. ఆ పంట నుంచి వచ్చే విత్తనాలతోనే వచ్చే అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే యాసంగి (రబీ) సీజన్‌లో సాగు చేసుకోవచ్చు. రబీ నుంచి వచ్చేవాటితో 2021 ఖరీఫ్‌లో మూడోసారి పండించవచ్చు.
ఖర్చు ఇలా తగ్గించుకోవచ్చు
క్వింటా సన్నరకం సాంబ మసూరి(బీపీటీ 5204) లేదా తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్15048) రకం వరి విత్తనాలు కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్ సీడ్స్) రూ.3100 ధర చెబుతోంది. ఇక కొన్ని ప్రైవేటు కంపెనీలు ఇలాంటి సన్నరకాల విత్తనాల ధరలను ఇష్టమొచ్చిన ధర నిర్ణయిస్తున్నాయి.
దీనివల్ల ఒక రైతు 3 సీజన్లకు 3 క్వింటాళ్ల వరి సన్నరకం విత్తనాలు కొనాలంటే కనిష్ఠంగా రూ.9300 దాకా ఖర్చవుతోంది. జయశంకర్ వర్సిటీ విక్రయించే తెలంగాణ సోనా విత్తనాలను రూ.3 వేలకు కొని 3 సీజన్ల దాకా వాడుకుంటే రైతుకు రూ.6300 ఆదా అవుతుంది.
మరిన్ని రకాలు
వరిలో ఇంకా కూనారం సన్నాలు, జగిత్యాల వరి(జేజీఎల్ 24423), సిద్ది, బతుకమ్మ విత్తనాలు వర్సిటీ పండించింది. మొక్కజొన్నలో ‘కరీంనగర్ మక్క-1, డీహెచ్‌ఎం-117, డీహెచ్‌ఎం-121 పేరుతో సంకరజాతి(హైబ్రీడ్) విత్తనాలున్నాయి. కందిలో ఉజ్వల, హనుమ, ఆశ, పెసర పంటలో యాదాద్రి, శ్రీరామ, భద్రాద్రి, మధిర-295, సోయా చిక్కుడు జేఎస్-335, బాసర, జేఎస్-93-05, జొన్నలో సీఎస్‌వీ-31, పాలెం పచ్చజొన్న-2 రకాల విత్తనాలను విక్రయానికి పెడుతున్నారు. మొత్తం 12,223 క్వింటాళ్ల విత్తనాలను పరిశోధన కేంద్రాల్లో పండించి సిద్ధం చేసింది. రైతులు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రాలకు ఈ నెల 15 తర్వాత వెళ్లి విత్తనాలు కొనుక్కోవచ్చని వర్సిటీ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ ‘ఈనాడు’కు చెప్పారు. టోల్‌ఫ్రీ నంబరు 18001801551 ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ఇవాళ 79 కరోనా కేసులు