ఎంబీబీఎస్ అనంతరం పలువురు పీహెచ్‌సీల్లో విధుల్లో చేరి.. ఇన్‌సర్వీస్ కోటా కింద సర్కారు వైద్య కళాశాలల్లో పీజీ వైద్యవిద్యను అభ్యసిస్తుంటారు. అలా స్పెషలిస్టు వైద్యులుగా మారిన వారి సేవలు బోధనాసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరం. ఈ నేపథ్యంలో వారిని వైద్యవిద్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్ పరిధిలోకి స్వీకరించే (అబ్‌సార్బ్) ప్రక్రియను ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. అయినా ఇలాంటి వారిలో దాదాపు 290 మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది. పెద్దాసుపత్రుల్లో సేవలందించడానికి పదే పదే ఆహ్వానిస్తున్నా, వారు ఆసక్తి చూపడంలేదు. తమ ప్రైవేటు ప్రాక్టీసుకు ఆటంకం లేకుండా ఉండడానికే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటువంటి వారి జాబితా సిద్ధం చేసిన వైద్యఆరోగ్యశాఖ ఈ నెల 23, 24 తేదీల్లో మరోసారి బోధనాసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోకి కౌన్సెలింగ్ ద్వారా తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కౌన్సెలింగ్‌కు వారు హాజరు కాకపోయినా, విధుల్లో చేరడానికి అయిష్టత ప్రదర్శించినా.. సంజాయిషీ తాఖీదులు జారీ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
ఎందుకీ అనాసక్తి?
స్పెషలిస్టు వైద్యుడిగా కొత్త నైపుణ్యం సాధించిన తర్వాత పీహెచ్‌సీల్లో పోస్టింగ్ దక్కించుకున్న వైద్యులు.. అక్కడ నామమాత్రపు విధులు నిర్వహిస్తూ.. సమీపంలోని పట్టణాల్లో సొంత ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీకి ఎప్పుడెళ్లి వచ్చినా పట్టించుకునే నాథుడే కరవవడంతో.. వారు ఆడింది ఆటగా మారిందనే విమర్శలున్నాయి. ఈ 290 మందిలో గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిల్లల వైద్యం, రేడియాలజీ, అనస్తీషియా.. ఇలా పలు విభాగాల స్పెషలిస్టులు ఉన్నారు. సర్కారులో ఇచ్చే వేతనం కంటే దాదాపు నాలుగైదింతలు అధికంగా ప్రైవేటులో సంపాదిస్తుండడంతో వీరంతా ప్రభుత్వ ఉన్నతస్థాయి వైద్యంలో సేవలందించడానికి ఆసక్తి చూపించడంలేదనే విమర్శలున్నాయి.