Prof Kodandaram Fires on BRS Govt Over Revenue Issues : గత ప్రభుత్వంలో రెవెన్యూ చట్టాలను ఇష్టానుసారంగా తయారు చేశారని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. గత పాలకులు భూమిని చాపలాగా చుట్టి సంకలో పెట్టుకుపోవాలని చూశారని ఆరోపించారు. ప్రజలందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలంటే యంత్రాంగం గ్రామ స్థాయి వరకు విస్తరించాలని ఆయన స్పష్టం చేశారు. బేగంపేటలోని హరితప్లాజాలో జరిగిన రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(TGTA) ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
భూసమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం తరఫున ఒక కమిటీ వేసి సూచనలు చేద్దామని ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram) అన్నారు. గత ప్రభుత్వం హయాంలో భూరికార్డులను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. తప్పులను వారికి అనుకూలంగా ఎలా వినియోగించుకున్నారో ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. మార్పులు సంస్కరణల కోసం రెవెన్యూ సిబ్బంది సంఘటితంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారం అందరికీ మేలు చేయాలని, అంతేగానీ ఒకరిద్దరుకు కాదని ధ్వజమెత్తారు. ప్రజలకు మేలు చేసేది వ్యవస్థకు మేలు చేస్తోందని, పాలకులకు మేలు చేసేది అధికారులకు నష్టం చేకూరుస్తుందని ఆచార్య కోదండరాం హితవు పలికారు.
"రికార్డులు లేకుండా వాటన్నింటినీ ధ్వంసం చేశారు. తమకు కావాల్సిన రీతిలో భూముల రికార్డులను సరిచేసుకోవడం మొదలు పెట్టారు. ఇది మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా దుర్వినియోగం చేశారో మనం చెప్పాలి. వాళ్ల తప్పులకు మనం ఎందుకు శిక్ష వేసుకోవాలి. వాటన్నింటినీ చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది."- కోదండరాం, ప్రొఫెసర్
గత ప్రభుత్వం రెవెన్యూ చట్టాలను ఇష్టానుసారం తయారు చేసింది : కోదండరాం
Akunuri Murali Advised Telangana Government : గత ప్రభుత్వం కలెక్టర్లను రియల్ ఎస్టేట్(Real Estate) ఏజెంట్లుగా కన్వర్టు చేశారని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం రెవన్యూ వ్యవస్థను ఉద్దేశ్యపూర్వకంగా ధ్వంసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ రాజకీయాన్ని వ్యాపారంలాగా విస్తరించారని ధ్వజమెత్తారు.