Kodandaram on Junior Panchayat Secretaries Regularization : రాష్ట్రానికి పంచాయతీ స్థాయిలో అనేక అవార్డులు రావడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కృషి ఎంతో ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్ర కీలకమని గుర్తుచేశారు. అలాంటి వారిని ఈ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జేపీఎస్‌లు చేస్తోన్న దీక్షకు కోదండరాం మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్థులను వెంటనే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రేయింబవళ్లు కష్టపడుతూ పని ఒత్తిడితో కొంత మంది జేపీఎస్‌లు చనిపోయారని.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల ప్రొబిషన్ కాలం ముగిసినందున వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జేపీఎస్‌ల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. వారి సమ్మెను ప్రభుత్వం విరమింపజేయాలని కోరారు. వారి సమ్మెకు తెలంగాణ జన సమితి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వారు చేస్తున్న సమ్మెకు టీజేఎస్ నేతలు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు.
మీడియా స్వేచ్ఛపై దాడి..:తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తన ఇంటి కార్యక్రమంలా, పార్టీ కార్యక్రమంలా చేపట్టిన సీఎం కేసీఆర్.. మీడియా స్వేచ్ఛపై అడుగడుగునా దాడి చేశారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌కు పెట్టిన ఖర్చును రాష్ట్రంలో జూనియర్ కార్యదర్శులకు పెట్టినా సమస్య తీరేదని.. కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతులకు కేటాయించినా సరిపోయేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని చెప్పిన బీఆర్‌ఎస్.. ఆ పనులను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.
Junior Panchayat Secretaries Protest: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వినూత్న రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ.. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని అన్ని జిల్లాల్లో జేపీఎస్‌లు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వర్షంలోనే నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద జేపీఎస్‌లు నిరసన దీక్ష చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ముగ్గులు వేసి మెహిందీ పెట్టుకుంటూ నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ ఆడిన కార్యదర్శులు.. ముఖ్యమంత్రి మాటిచ్చినట్లుగా సర్వీస్ కాలం పూర్తి చేసిన తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు.