తెలంగాణ

telangana

ETV Bharat / state

IICT Hyderabad news: పదిహేనేళ్ల స్వప్నం సాకారం.. ఐఐసీటీ నుంచి హైడ్రాజైన్‌ హైడ్రేట్‌ ఉత్పత్తి - హైడ్రాజైన్‌ హైడ్రేట్‌ ఇంధనం ఉత్పత్రి

రాకెట్లలో ఉపయోగించే ఇంధనం హైడ్రాజైన్‌ హైడ్రేట్‌(HH news)ను హైదరాబాద్‌లోని ఐఐసీటీ దేశీయంగా అభివృద్ధి చేసింది. దేశీయ అవసరాల కోసం వార్షికంగా 40 వేల టన్నుల హెచ్‌హెచ్‌ అవసరం ఉండగా.. 14 వేల టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఒకటిన్నర దశాబ్దాల కృషిలో ఎన్నో సవాళ్లు, వైఫల్యాలు ఎదురయ్యాయి. నాయకత్వం ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతుతో శాస్త్రవేత్తల బృందం సాధించి చూపించింది.

IICT Hyderabad news, IICT news 2021
ఐఐసీటీ నుంచి హైడ్రాజైన్‌ హైడ్రేట్‌ ఉత్పత్తి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ న్యూస్

By

Published : Oct 25, 2021, 9:34 AM IST

పదిహేనేళ్ల స్వప్నం సాకారమైంది. అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లలో ఉపయోగించే పర్యావరణహిత శుద్ధమైన ఇంధనం హైడ్రాజైన్‌ హైడ్రేట్‌(HH news)ను హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(IICT news 2021) దేశీయంగా విజయవంతంగా అభివృద్ధి చేసింది. నిత్యజీవితంలో ఉపయోగించే దుస్తులు వెచ్చగా ఉండేందుకు, సస్యరక్షణలో వాడే రసాయనాల్లో, సికిల్‌ సెల్‌, క్యాన్సర్‌ మందుల తయారీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. దేశీయ అవసరాల కోసం వార్షికంగా 40 వేల టన్నుల హెచ్‌హెచ్‌ అవసరం ఉండగా.. 14 వేల టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఐఐసీటీ శాస్త్రవేత్తలు డాక్టర్‌ జేఎస్‌యాదవ్‌, డాక్టర్‌ కె.లక్ష్మీకాంతం, డాక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ల నాయకత్వంలో శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేపట్టింది. ఒకటిన్నర దశాబ్దాల కృషిలో ఎన్నో సవాళ్లు, వైఫల్యాలు ఎదురయ్యాయి. నాయకత్వం ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతుతో శాస్త్రవేత్తల బృందం సాధించి చూపించింది.

మిల్లీగ్రాముల నుంచి కిలోలకు...

ఒక చిన్న ల్యాబ్‌లో తొలుత 40 శాతం హెచ్‌హెచ్‌తో కొన్ని మిల్లీగ్రాముల తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా.. దీన్ని 80 శాతం హెచ్‌హెచ్‌ స్థాయికి తీసుకెళ్లారు. ప్రయోగాత్మక ప్లాంట్‌లో ప్రస్తుతం గంటకు 12 కిలోల హెచ్‌హెచ్‌ను ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు 400 కిలోల హెచ్‌హెచ్‌ను తయారుచేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్కెటింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. భారత్‌, అమెరికాలో రెండుచోట్ల దీనిపై ఐఐసీటీకి పేటెంట్లు ఉన్నాయి. 80 శాతం హెచ్‌హెచ్‌ కలిగిన పదివేల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రాథమిక ఇంజినీరింగ్‌ ప్యాకేజీని ఐఐసీటీ తయారుచేసి గుజరాత్‌ అల్కలీస్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(GACL news)కు బదిలీ చేసింది. రూ.450 కోట్లతో వాణిజ్య ప్లాంటు ఏర్పాటుకు జీఏసీఎల్‌ పెట్టుబడి పెట్టింది. వచ్చేఏడాది మార్చి నుంచి గుజరాత్‌లోని దహేజ్‌లో ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో అన్నారు.

ఇదీ చదవండి:TRS Party 20 Years celebrations : తెరాస 20 ఏళ్ల ప్రస్థానం: పోరాట పంథా నుంచి.. ప్రగతి పథంలోకి...

ABOUT THE AUTHOR

...view details