ఏప్రిల్ 24 నాటికి రాష్ట్రంలో రెండో డోస్ టీకా అందనివారి సంఖ్య దాదాపు 41 వేలుగా ఉంది. ‘రెండో డోస్ కోసం ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బాగా ఇబ్బంది పడుతున్నారు’ అని రిటైర్డ్ ఉద్యోగి నర్సింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటులో ఇబ్బంది
తొలి డోస్ వ్యాక్సిన్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో జోరుగా వేశారు. రెండో డోస్‌కు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా తగ్గింది. తొలి డోస్ వేసుకున్నవారు ప్రస్తుతం రెండో డోస్‌కోసం ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓ ఆసుపత్రిలో 100 మంది స్లాట్ బుక్ చేసుకుంటే 40-50 మందికే వ్యాక్సిన్లు వస్తున్నాయి. మిగిలినవారు వెనుదిరిగిపోతున్నారు.
కనిష్ఠ సగటు వ్యవధి 6 వారాలు
రెండు డోస్‌ల మధ్యవ్యవధి టీకా తయారీ కంపెనీని బట్టి 4-6 వారాలు, 6-8 వారాలుగా ఉంది. కనిష్ఠ సగటు వ్యవధి 6 వారాలు. మార్చి 12న మొదటి డోస్ టీకా తీసుకున్నవారందరికీ కనిష్ఠ వ్యవధి ప్రకారం ఏప్రిల్ 24 నాటికి రెండో డోస్ ఇవ్వాలి. కానీ, 40,968 మందికి ఇవ్వలేదు. రానున్నరోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
*నల్గొండ జిల్లా అనుముల మండలానికి చెందిన రైతు దంపతులు మార్చి 12న హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఏప్రిల్ 12న రెండో డోస్‌కు వెళ్తే వ్యాక్సిన్లు లేవని, మిర్యాలగూడెం లేదా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమన్నారు. మిర్యాలగూడెంలోనూ లేవని తెలిసింది.
*హైదరాబాద్ వనస్థలిపురంలో ఉండే రిటైర్డ్ ఉద్యోగి (63) హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో డోస్‌కి ఏప్రిల్ 1న రమ్మని ఎస్‌ఎంఎస్ వచ్చింది. తీరా వెళ్లాక గడువు పెంచారని, వ్యాక్సిన్ కొరత ఉందని అన్నారు. గట్టిగా అడిగితే తమకు టీకాలు రావట్లేదని చెప్పేశారు. దాంతో ఓ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటికే తొలి డోస్ తీసుకుని సుమారు 7 వారాలైంది.
నాలుగు ఆసుపత్రులు తిరిగినా దొరకలేదు
మార్చి 15న నేను, మా ఆవిడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తొలి డోస్ తీసుకున్నాం. ఆ ఆసుపత్రికి రెండో డోస్‌కు వ్యాక్సిన్లు తక్కువ వస్తున్నాయి. నాతోసహా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరో మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రయత్నించినా దొరకలేదు. వారం నుంచి ఆందోళన చెందుతున్నా. మళ్లీ బుకింగ్‌కు ప్రయత్నిస్తుంటే మే 3 వరకు స్లాట్లు లేవని వస్తోంది. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడినవారికీ వ్యాక్సిన్లు వేస్తారు. ఆసుపత్రులకు వ్యాక్సినేషన్ కోసం వచ్చే జనం భారీగా పెరుగుతారు. నా వయసు 75, మా ఆవిడ వయసు 65. ఎలా వెళ్లాలోనని భయమేస్తోంది.