రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఒప్పంద ఉద్యోగుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతో వారి క్రమబద్ధీకరణ ప్రక్రియకు న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోయినట్లైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. 2015లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక, వైద్య-ఆరోగ్య, విద్యా శాఖల కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించి ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం 2016 లో ఉత్తర్వును జారీ చేసింది. ఆ జీఓ ప్రకారం కొందరి క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది.
జీఓ 16 అమలుపై హైకోర్టు స్టే...
అయితే ఇది నిరుద్యోగ యువత అవకాశాలకు నష్టం చేకూరుస్తుందని 2016 లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో జీఓ 16 అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇటీవలే ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యాక నియామకాలు చేపట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం నియామకమైన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు.