లాక్‌డౌన్ ప్రభావం దివ్యాంగుల జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. వైకల్యం ఉన్నా వెరవకుండా బతుకు పోరాటం చేస్తున్న విధి వంచితులను కరోనా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నచిన్న పనులూ దూరమై పూట గడవని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అందించే పింఛను సాయం కుటుంబపోషణకే సరిపోవడం లేదు. అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది దాతలిచ్చే నిత్యావసరాలతో పూట గడుపుతున్నారు. ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటున్నారు.
జేబులో చిల్లి గవ్వ లేదు...
రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది దివ్యాంగులున్నారు. వీరిలో 70 శాతం మంది ప్రభుత్వ పింఛను పొందుతున్నారు. కొంత మందికి అర్హత ఉన్నా పింఛను అందడం లేదు. చాలా మంది చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దుకాణాల్లోనూ, ఇతరత్రా చోట్ల కూలీ చేస్తూ జీవిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వీరికి నెల రోజులుగా పని లేక జేబులో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఏప్రిల్ నెల ఇంటి అద్దె చాలా వరకు చెల్లించలేదు. మే నెల మరింత ఇబ్బందిగా మారే పరిస్థితి.