తెలంగాణ

telangana

ETV Bharat / state

NEW MUNICIPALITIES: ప్రగతికి దూరంగా 69 కొత్త మున్సిపాలిటీలు - telangana top news

రాష్ట్రంలో మూడేళ్ల కిందట ఏర్పాటైన 69 కొత్త పురపాలక సంఘాలు పూర్తిస్థాయి సిబ్బంది లేక సతమతమవుతున్నాయి. పౌరసేవలు అంతంతమాత్రంగా ఉండగా అభివృద్ధిపనులు ఎక్కడివి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. నిధులున్నా పనులు చేయలేని పరిస్థితి కొన్నిచోట్ల, నిధుల సమస్య మరికొన్ని చోట్ల. బాన్సువాడ, వర్ధన్నపేట, మక్తల్‌, హాలియా, నకిరేకల్‌, మరిపెడ, చండూరు, నేరెడుచర్ల, ఎల్లారెడ్డి, డోర్నకల్‌, పెద్దఅంబర్‌పేట, తుక్కుగూడ... ఇలా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి.

problems-with-staff-shortages-in-new-municipalities
ప్రగతికి దూరంగా 69 కొత్త మున్సిపాలిటీలు

By

Published : Aug 21, 2021, 7:25 AM IST

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మెరుగైన ప్రజాజీవనం, చక్కటి మౌలిక వసతులు లక్ష్యాలుగా ఏర్పాటైన పురపాలకసంఘాలు వాటన్నిటికీ దూరంగానే ఉండిపోయాయి. కమిషనర్‌తో పాటు మరో ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రం రెగ్యులర్‌గా ఉంటూ మిగిలిన కీలకమైన ఉద్యోగులంతా డిప్యుటేషన్‌పై పని చేస్తుండటంతో పరిపాలన గాడి తప్పింది. జనాభా, పట్టణ విస్తీర్ణం ప్రాతిపదికగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగలేదు. అత్యధిక పురపాలికల్లో 25 నుంచి 30 మంది కార్మికులే ఉన్నారు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉంది.

అంతే సిబ్బంది...అవే సమస్యలు

కాలువలను చాలా చోట్ల నెలకు ఒకసారి కూడా శుభ్రపరిచే పరిస్థితి లేదు. వర్షాకాలం వస్తే మురుగునీరు, వాననీరు కలసి దుర్భరమైన పరిస్థితులకు దారితీస్తున్నాయి. కనీస వసతుల కోసం ప్రభుత్వం ప్రతి పురపాలక సంఘానికి రూ.10-20 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులు 90 శాతం పట్టణాల్లో అసంపూర్తిగానే ఉన్నాయి. టెండర్ల దశలో కొన్ని, మధ్యలోనే ఆగిపోయినవి మరికొన్ని... శిలాఫలకాలకే పరిమితమైనవి ఇంకొన్ని. పూర్తిస్థాయి అధికారులు లేక పర్యవేక్షణ లోపించింది. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా ఉంది. ప్రభుత్వం నిధులిచ్చినా, పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక్కో రోజు ఒక్కో చోట విధులు

  • కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి పురపాలక సంఘం ఏర్పాటై మూడేళ్లయ్యింది. అక్కడ ఉన్నది కమిషనర్‌ ఒక్కరే. ఇటీవలే మేనేజర్‌ను నియమించారు. ఇన్‌ఛార్జులుగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ రెండు రోజులకోసారి, మున్సిపల్‌ ఇంజినీర్‌ వారానికి రెండుసార్లు వస్తారు. జూనియర్‌ అకౌంట్స్‌ అధికారిదీ ఇదే పరిస్థితి. సీనియర్‌ అసిస్టెంట్‌ లేరు. గతంలో పంచాయతీలో ఉన్న 40 మంది పారిశుద్ధ్య కార్మికులే ఇప్పుడూ పనిచేస్తున్నారు. సుమారు 20 వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో పల్లెగా ఉన్నప్పటి సమస్యలే యథాతథంగా ఉన్నాయి.
  • మక్తల్‌లో పురపాలక కమిషనర్‌ ఉన్నారు. తాండూరు టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ మక్తల్‌కు ఇన్‌ఛార్జి. వారంలో ఆయన తాండూరులో నాలుగు రోజులు, కోస్గి, మక్తల్‌లో ఒక్కోరోజు విధులు నిర్వహిస్తారు. 23 వేల జనాభా ఉన్న పట్టణంలో గతంలో పంచాయతీలో ఉన్న 40 మంది పారిశుద్ధ్య సిబ్బందే ఇప్పటికీ పనిచేస్తున్నారు. విలీన గ్రామాల్లో రోడ్లపై మట్టి కూడా వేయలేదు.
  • చండూరు మున్సిపాలిటీ అయినా, గ్రామపంచాయతీ కంటే భిన్నంగా లేదు. డంపింగ్‌ యార్డు, సమీకృత మార్కెట్‌ ఏర్పాటు కాలేదు. మురుగు కాలువలు లేవు. రహదారి విస్తరణ మధ్యలోనే ఆగిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ సాధారణంగా మారింది. శివారు కాలనీల్లో సమస్యలు యథాతథం.
  • పరిగి పురపాలక సంఘంలో రెగ్యులర్‌గా ఉన్నది మున్సిపల్‌ కమిషనర్‌ ఒక్కరే. మేనేజర్‌, టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌, ఇంజినీర్‌, అకౌంటెంట్‌ అంతా ఇన్‌ఛార్జులే.
  • డోర్నకల్‌ నిధుల సమస్యలతో సతమతమవుతోంది. జనాభా సుమారు 15 వేలు. పారిశుద్ధ్య సిబ్బంది కేవలం 29 మంది. ఇద్దరు అధికారులు మినహా అందరూ ఇన్‌ఛార్జులే.
  • వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఇద్దరే రెగ్యులర్‌ ఉద్యోగులు. ఇద్దరు ఇన్‌ఛార్జులు. రెండు పోస్టులు ఖాళీ. పారిశుద్ధ్య కార్మికులు 25 మంది. రోడ్లు, మురుగునీటి కాలువలు లేక జనం ఇబ్బంది పడుతున్నారు.
  • పెబ్బేరు పురపాలక సంఘంలో కమిషనర్‌ మినహా ఇతర ఉద్యోగులంతా ఇన్‌ఛార్జులే. వనపర్తి తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న వీరు వారానికో, పది రోజులకో వస్తున్నారు.
  • కొత్తకోటలోని కొన్ని వార్డుల్లో తప్ప, మిగిలిన చోట్ల కనీస పనులు చేపట్టలేదు. ప్రధాన రహదారి విస్తరణ, బీటీ రోడ్డు పనులను రూ.3.5 కోట్లతో ప్రారంభించి ఏడాదిన్నరైనా పూర్తికాలేదు. పారిశుద్ధ్య సిబ్బంది తగినంత మంది లేకపోవడంతో నెలకోసారి కూడా మురుగుకాల్వలను శుభ్రం చేయడంలేదు.

నిధులున్నా కదలని పనులు

వర్ధన్నపేట పురపాలక సంఘంలో పది తండాలను కలిపారు. మూడేళ్లయినా ఈ పది తాండాల్లో కనీసం ఒక్క పని కూడా చేయలేదు. వర్ధన్నపేటకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, మంత్రి దయాకర్‌రావు రూ.30 కోట్లు మంజూరు చేయించారు. వీటిలో ఇప్పటివరకు రూ. 5 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. చేపట్టిన పనుల్లో ఒక్కటి కూడా పూర్తికాలేదు. డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌, పురపాలక కాంప్లెక్స్‌ భవనం, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, సులభ్‌ కాంప్లెక్స్‌, డంపింగ్‌ యార్డు, రైతుబజార్‌, శ్మశాన వాటిక... ఇలా ముఖ్యమైన పనుల్ని మధ్యలో వదిలేశారు. మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి.

శివారు... చూసేవారెవరు?

పట్టణంలో విలీనమైన శివారు ప్రాంతాల (పూర్వగ్రామాలు) వైపు అధికారులు, సిబ్బంది కన్నెత్తి చూస్తున్న దాఖలాల్లేవు. అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు లేవు. వృథా నీరంతా ఇళ్ల మధ్య, రోడ్లపైనే ప్రవహిస్తోంది. వర్షాకాలంలో దోమల సమస్య పీడిస్తోంది.

ఇదీ చూడండి:CM KCR review: హుజూరాబాద్​లో ఏం జరుగుతోంది..?

ABOUT THE AUTHOR

...view details