తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలుష్యంలో బతుకులు... ఇంకెన్నాళ్లీ కష్టాలు

హైదరాబాద్‌... ఐటీ హబ్‌లకే కాదు... ఫార్మా ఇండస్ట్రీలకు చిరునామా. అయితే, ఐటీ పరిశ్రమలు నెలకొన్న ప్రాంతాల్లో హైటెక్‌ జీవితాలు ఉంటే.... రసాయనిక కంపెనీల చుట్టూ మాత్రం దుర్భర జీవితాలు తారసపడుతున్నాయి. కనీస బాధ్యతను విస్మరించి పరిశ్రమలు.... పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో... తాగేందుకు మంచి నీళ్లు, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి లభించక... జీడిమెట్ల వాసులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్నా...కోర్టులు సూచిస్తున్నా... హరిత ట్రైబ్యునల్‌ పర్యవేక్షిస్తున్నా.... పారిశ్రామిక వాడల పరిసర ప్రాంతాల జీవితాలు మాత్రం మారడం లేదు. ఏళ్లకేళ్లుగా సమస్యలు అలాగే మిగిలిపోవడంతో... కాలుష్య కోరల్లోనే కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది.

Jeedimetla
industrial waste

By

Published : Apr 19, 2021, 6:51 PM IST

కాలుష్యంలో బతుకులు... ఇంకెన్నేళ్లీ కష్టాలు

ఒకటా....రెండా.... ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో. జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు ఎలా ఉన్నాయో వీరి మాటల్లోనే అర్థమవుతోంది. ఒకప్పుడు పారిశ్రామిక వాడలు వస్తున్నాయంటే ఎంతో సంబరపడేవాళ్లు. ఇప్పుడు మాత్రం మా ప్రాంతంలో వద్దంటే వద్దు బాబోయ్‌..! అంటూ గగ్గోలు పెడుతున్నారు. అందుకు కారణం... ఆయా కంపెనీలు నిబంధనలు పక్కనపెట్టి.... గాలి, నీరు, మట్టిని కాలుష్యం చేస్తుండటమే. ఉపాధి అవకాశాలు రావట్లేదా..! అంటే అది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు రోగాల బారిన పడి సర్వస్వం కోల్పోతున్న కుటుంబాలు ఎన్నో. అందుకు ఉదాహరణే...జీడిమెట్ల. కొన్ని పరిశ్రమల యాజమాన్యాల పోకడలతో ఇక్కడి గాలి, నీరు, నేల కలుషితంగా మారాయి. రకరకాల పద్ధతుల్లో రసాయన వ్యర్థాలను భూగర్భంలో కప్పిపెట్టడం... బోరుబావుల్లో గుమ్మరించడం... నాలాల్లో కలపడం వంటి చర్యలతో గుక్కెడు మంచి నీళ్లు... స్వచ్ఛమైన గాలి కరవయ్యాయి.

నిబంధనలు ప్రశ్నార్థకమే..

జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిసర ప్రాంతాల్లో 100కు పైగా బల్క్‌డ్రగ్‌, రసాయనిక, ఫార్మా, రీసైక్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి. సాధారణంగా ఉత్పత్తుల తయారీలో భాగంగా ప్రమాదకర ఘన, ద్రవ, వాయు రసాయన వ్యర్థాలు వెలుడుతాయి. అయితే, అందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాల్ని మల్టిపుల్‌ ఎఫెక్టివ్‌ ఎవాపరేటర్లు, ఆర్‌ఓలతో శుద్ధి చేసి బయటకు విడుదల చేయాలి. అయితే, ఈ నియమాల్ని ఇక్కడున్న కంపెనీలు ఏ మేరకు పాటిస్తున్నాయన్నది ప్రశ్నార్థకమే.

గరళమవుతున్న జలం

కొన్ని బడా కంపెనీలు పరిమితికి మించి ఉత్పత్తులు తయారు చేస్తుండడంతో వ్యర్థాలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఈ వ్యర్థాల్ని... పటాన్‌చెరులోని పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి కేంద్రం- పీఈటీఎల్​, జీడిమెట్లలోని శుద్ధి కేంద్రం - జేఈటీఎల్​కు తరలించాలి. కానీ, చాలా కంపెనీలు అసలు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. జల వ్యర్థాల్ని యథేచ్ఛగా చుట్టుపక్కల ప్రదేశాల్లో వదిలేస్తున్నాయి. మరికొన్ని పరిశ్రమలు ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు తరలించి రాత్రి వేళల్లో వ్యర్థజలాలను డంప్ చేస్తున్నాయి. తద్వారా... ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషతుల్యమౌతున్నాయి.

గుట్టుచప్పుడు కాకుండా..

వ్యర్థ జలాల గాఢతను బట్టి ఒక్కో ట్యాంకర్‌కు వేలాల్లో చెల్లించాల్సి రావడం వల్ల కొన్ని కంపెనీలు గుట్టు చప్పుడు కాకుండా వాటిని జనాలు ఉండే నాలాల్లోకి వదులుతున్నారు. రసాయన వ్యర్థాల కలయికతో నాలాల్లో నుంచి వచ్చే ఘాటైన వాసన స్థానిక ప్రజల ప్రాణాలను హరిస్తోంది. చావు తెలివితేటలు ఎక్కువైపోయిన కంపెనీ యాజమాన్యాలైతే ఏకంగా భూగర్భంలోకి పైపులైన్లు వేసి వ్యర్థాల్ని విడుదల చేస్తున్నాయి. తద్వారా... రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భజలాల్ని కలుషితం చేస్తున్నాయి.

తాగడం కూడానా..

ఇది నిన్న... మెున్న వెలుగులోకి వచ్చిన విషయమేమి కాదు. గత కొన్నేళ్లుగా జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిధిలోని సుభాష్‌ నగర్‌, కుత్భుల్లాపూర్‌ వాసులు ఈ వ్యథను అనుభవిస్తునే ఉన్నారు. తాగునీరు కోసం బోర్లు వేసుకుంటే... అందులో నుంచి దుర్వాసనతో కూడిన నీళ్లు ఎరుపు, పసుపు రంగుల్లో వస్తున్నాయి. ఈ నీటిని తాగడం సంగతి ‌అటు ఉంచితే... కనీసం మరుగుదొడ్ల నిర్వహణకు కూడా ఉపయోగించలేని రీతిలో ఉన్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి:కాలుష్యం బారి నుంచి నదులకు మోక్షమెప్పుడు?

అప్పుడు మినరల్​ వాటరే దిక్కు

తప్పని పరిస్థితుల్లో ఈ నీటితో కాళ్లు చేతులు కడుక్కుంటే ఇక అంతే. విపరీతమైన దురదతో...చర్మసంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. దీంతో... ఇక్కడి ప్రజలకు మంజీరా నీళ్లే దిక్కు అయ్యాయి. అయితే, ఒక్కోసారి అక్కడక్కడా పైపులైన్లు పగిలినప్పుడు కొన్ని రోజుల పాటు మంజీరా నీళ్లు రావు. అప్పుడు, స్నానం దగ్గరి నుంచి అన్ని రకాల ఉపయోగాలకు మినరల్‌ వాటర్‌నే వాడాల్సి వస్తోందని వాపోతున్నారు.

వర్షాకాలమొస్తే అంతే..!

వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతోంది. వర్షం పడిందంటే చాలు పరిశ్రమలు నిల్వచేసిన వ్యర్థాలు నాలాల్లోకి ఎక్కువగా చేరుతాయి. దాదాపుగా అన్ని కంపెనీలు ఈ మార్గాన్నే అనుసరించడంతో...వ్యర్థ రసాయనాలు, వర్షపు నీటి మట్టం పెరిగి... మురుగు నీరు ఇళ్లలోకి చేరుతోంది. మరీ, కనీసం ఆ నాలాలు అయినా పెద్దగా ఉంటాయా... అంటే అది లేదు. వాటి సామర్థ్యం కూడా అంతంతమాత్రమే. చెత్తాచెదారం మొత్తం నాలాల్లో నిండిపోయి నీళ్లు నిలబడడంతో దుర్వాసన వస్తోంది. కనీసం... మున్సిపల్‌ సిబ్బంది నాలాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారా... అంటే అది లేదు. ఫలితంగా, వివిధ రకాల జబ్బుల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి:జల సిరులు.. కాలుష్య కాసారాలుగా

పదయిందంటే అంతే..!

జలం ఎలాగో కలుషితమైంది..... కనీసం, హాయిగా గాలి పీల్చుకుందామనుకునే అవకాశం కూడా ఇక్కడి వాసులకు లేకుండా పోయింది. కొన్ని పరిశ్రమలు రాత్రి పది దాటితే చాలు.. నిబంధనలకు విరుద్ధంగా గాల్లోకి రసాయనాలను వదులుతున్నాయి. దీంతో...ఇంటి తలుపులు తెరవలేని పరిస్థితి. ఆ రసాయనిక గాలులు పీల్చడం వల్ల...శ్వాసకోస, ఊపిరితిత్తుల సమస్యలతో ఆస్పత్రి మెట్లు ఎక్కాల్సిందే.

ఎవరికి చెప్పుకోవాలి..?

తమ గోసను చెప్పుకుందామన్నా... ఎవరూ పట్టించుకోవట్లేదని వీరు ఆవేదన చెందుతున్నారు. ఇది వరకు... కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం చింతల్‌లో ఉండేది. ఇప్పుడు దానిని బేగంపేటకు తరలించారు. దీంతో... సమస్యల్ని వెంటనే చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని జీడిమెట్ల వాసులు వాపోతున్నారు. ఈ క్రమంలో... నిబంధనలకు విరుద్ధంగా.. లోపాలు ఉన్న పరిశ్రమల యాజమాన్యాలతో పీసీబీ అధికారులు కుమ్మక్కై ప్రజల ఫిర్యాదులను పట్టించుకోవడంలేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏదో మమ అనిపించామా లేదా అన్నట్లుగా... తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల.... ఆయా పరిశ్రమల యాజమాన్యాలు మరింత బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని జీడిమెట్ల వాసులు ఆరోపిస్తున్నారు.

ఏమనుకోవాలి...

తమ సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదు. ఈ సమస్యపై ఈటీవీ ప్రతినిధి పీసీబీ అధికారులను సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ తమ పరిధికాదంటూ దాటవేస్తూ వచ్చారు తప్పితే సమస్యను పరిష్కారిస్తామనే మాట మాత్రం ఎవరి నోటి వెంట రాలేదు. మరీ, దీనిని ఏ విధంగా చూడాలి..? స్థానికులు చెబుతున్నట్లు అధికారులు యాజమాన్యాలతో కుమ్మకయ్యారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ సమస్య ఇప్పటిది కాదు... ఏళ్లకేళ్లుగా వెంటాడుతూనే ఉంది. ప్రజాప్రతినిధుల హామీలు హామీలుగానే మిగిలిపోతున్నాయి. కోర్టులు ఆదేశాలిస్తున్నా...అమలులో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో... వారు తమ ఆవేదన గురించి ఎంత మెుత్తుకున్న అది...అరణ్య రోదనగానే మిగిలిపోతోంది.

ఇదీ చూడండి:పుర, నగరపాలక ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details