గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త బండ్లు కొంటున్న వాహనదారులకు రవాణాశాఖ చుక్కలు చూపిస్తోంది. బైకులు, కార్లు కొన్న తర్వాత బండి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారాలు, నెలలు దాటినా స్లాట్ లభించడం లేదు. తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) నంబర్లపై వెళ్తుంటే కొందరు ట్రాఫిక్ పోలీసులు ఆపి.. నెలరోజులు దాటినా రిజిస్ట్రేషన్ నంబర్ లేదు.. కేసు రాస్తామంటూ బెదిరిస్తున్నారు. మరికొందరు ట్రాఫిక్ పోలీసులు ‘విత్‌అవుట్ నంబర్ ప్లేట్’ అంటూ కేసులు రాస్తున్నారు.
స్లాట్‌లు దొరకడం లేదంటూ వాహనదారులు చెబుతున్నా వినడం లేదు. రవాణా శాఖ సర్వర్‌లో స్వల్ప ఇబ్బందుల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. రోజువారీ స్లాట్ల సంఖ్య పెంచాలంటూ ఉన్నతాధికారులకు విన్నవించామంటూ రంగారెడ్డి, మేడ్చల్ రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించేంత వరకూ కొత్త వాహనాలు కొంటున్నవారికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయా? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
సిబ్బంది కొరత:వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగా ఐదు కార్యాలయాల్లో స్లాట్లను పెంచుతుండగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్యాలయాల్లో ఆర్సీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన స్లాట్లు లభించడం లేదు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటుంటే.. నెలరోజుల తర్వాత తేదీలు వైబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. మరోవైపు రవాణాశాఖ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది కొరత వల్లే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది.