తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్‌డౌన్‌ పొడిగింపుతో వారికి తప్పని తిప్పలు...

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ మే 31 వరకు పొడిగించారు. దీనితో ప్రయాణికులకు తిప్పలు తప్పట్లేదు. గత 55 రోజులుగా స్వస్థలాలకు వెళ్లలేక చాలా మంది చిక్కుకున్నారు. జూన్‌ 30 వరకు రైళ్లు నడవబోవనే ప్రకటనతో వారి గుండెల్లో రైళ్లు పరుగులెత్తగా... ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ వాపోతున్నారు.

Problems for travelers with lock down Extension in india
లాక్‌డౌన్‌ పొడిగింపుతో వారికి తప్పని తిప్పలు...

By

Published : May 18, 2020, 9:42 AM IST

చుట్టం చూపుగా.. వివిధ పనులపై.. పలు కారణాలతో వచ్చి నగరంలో చిక్కుకున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వలస కార్మికులకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.. ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. అవి అన్ని మార్గాల్లో నడవడం లేదు. సొంత వాహనం ఉండేవారు.. వివిధ ఆరోగ్య కారణాలతో స్వస్థలాలకు చేరారు. సొంత వాహనం లేని మధ్యతరగతి వారు నగరంలో 55 రోజులుగా చిక్కుకున్నారు. నగరం వెలుపల కూడా వేలాది మంది ఉండిపోయారు. ప్రత్యేక రైళ్లు నడిపితే వీరికి ఎంతో ఊరటగా ఉంటుంది. ఈ తరుణంలో.. జూన్‌ 30 వరకు రైళ్లు నడవబోవనే ప్రకటనతో వారి గుండెళ్లో రైళ్లు పరుగులెత్తగా.. ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతామన్న బస్సుల ప్రయాణం కూడా వాయిదా పడడం వల్ల ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ వాపోతున్నారు. తాజాగా ఈ నెలాఖరుదాకా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌లో.. అంతర్రాష్ట్ర బస్సులు నడిపేందుకు అనుమతిచ్చింది. పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రాల అంగీకారం మేరకు అంటూ మెలిక పెట్టింది. దీంతో.. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న హైదరాబాద్‌ నుంచి రాకపోకలుంటాయా అనేది సందేహంగా మారింది.

నగరం నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా 2 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. రైళ్ల ద్వారా మరో 2.20లక్షల మంది ప్రయాణికులు స్టేషన్లలో అడుగుపెడుతుంటారు. అలాంటిది లాక్‌డౌన్‌తో 55 రోజులుగా రైలు కూత వినపడడంలేదు.. బస్సు హారన్‌ వినిపించడం లేదు. ప్రయాణాలు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూసినవారికి రైల్వే నిర్ణయం నిరాశకు గురి చేసింది. నగరంలో చిక్కుకున్న వారిని తీసుకెళ్లడానికి స్పందన వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో నమోదు చేసుకున్నవారి కోసం బస్సులు నడుపుతామని ప్రకటించింది. ముందుగా నగరం నుంచి వెళ్లేవారి సంఖ్య 13 వేలున్నా.. తర్వాత ఈ సంఖ్య లక్షలకు చేరుకుంది. ఇంతలో బస్సుల నిర్ణయం వాయిదాపడటంతో నగరంలో చిక్కుకున్న వారు స్వస్థలాలకు వెళ్లడం ప్రశ్నార్థకమయ్యింది.

ప్రత్యేక రైళ్లు నడపాలి..

బెంగళూరు - దిల్లీ మధ్య ప్రతిరోజు ఒక ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ప్రతి బుధవారం నగరం నుంచి దిల్లీకి.. ప్రతి ఆదివారం దిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు ఒక ప్రత్యేక రైలు వేశారు. ఈ రైలులో ప్రయాణించేవారు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇదే మాదిరి ఉత్తరాంధ్రవైపు కూడా ప్రత్యేక రైళ్లు నడిపితే విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో అంతర్రాష్ట్ర బస్సులు నడిస్తే కాస్త ఊరటగా ఉంటుందని కోరుతున్నారు.

లాక్‌డౌన్‌ పొడిగింపుతో తప్పని తిప్పలు

ఇదీ చదవండి:వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు

ABOUT THE AUTHOR

...view details