Private Bus Travel Charges: కేపీహెచ్‌బీ ధర్మారెడ్డికాలనీ ఫేజ్-1కి చెందిన ఓ మహిళ తన తల్లితో కలిసి పండక్కి ఈనెల 11న రాత్రికి తణుకు వెళ్లేందుకు పదిరోజుల కిందట ప్రైవేటు ట్రావెల్స్‌లో రూ.2 వేలతో 2 టికెట్లు బుక్ చేసుకుంది. వారం తర్వాత సదరు ట్రావెల్స్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు బుక్ చేసిన టికెట్లతో గిట్టుబాటు కావడం లేదంటూ ఆ రెండు టికెట్లను రద్దు చేసి డబ్బు తిరిగి పంపించారు. మరో ట్రావెల్స్‌లో బుక్ చేసుకుంటే 2 టికెట్లకు రూ.3 వేలు అయ్యాయి.
ఇష్టారాజ్యంగా పెంచేసి..:సొంతూళ్లకు వెళ్లేవారు ఎక్కువగా ఈనెల 12, 13నే బయలుదేరేందుకు టికెట్ల కోసం పాట్లు పడుతున్నారు. సాధారణ రోజుల్లో ఛార్జీలకు దాదాపు 50 శాతం పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడంతోపాటు స్లీపర్ బస్సులు సైతం అందుబాటులోకి రావడంతో ప్రైవేట్ ట్రావెల్స్‌పై ప్రభావం పడిందని పలువురు ఏజెంట్లు చెబుతున్నారు.