రైలు బండి అంటేనే ఆలస్యానికి చిరునామాని సగటు ప్రయాణికుడి అభిప్రాయమిది. మరోవైపు ప్రైవేటు రైళ్లేమో సమయానికి గమ్యస్థానం చేరతాయని ప్రకటనలు. ఇందుకు అనుగుణంగా అవి సకాలంలో గమ్యస్థానం చేరేలా ముందు నడిచే రెగ్యులర్ ట్రైన్‌లను పక్కకు ఆపుతున్నారు రైల్వే అధికారులు.
రానున్న రోజుల్లో ప్రైవేటు రైళ్ల సంఖ్య 100 మార్గాల్లో 150కి పెంచేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతున్నందున.. ఇప్పటికే ఆలస్యంగా నడుస్తున్న రెగ్యులర్ రైళ్లు మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పరిహారం తప్పించుకునేందుకు
ఐదు నెలల క్రితం దిల్లీ-లఖ్‌నవూ తర్వాత ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య ప్రైవేటు తేజస్ రైళ్లు పట్టాలెక్కాయి. మరో ప్రైవేటు రైలు ఇండోర్-వారణాసి మధ్య రాకపోకలకు సిద్ధమైంది. మెరుగైన సేవల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు రైళ్లలో ఎక్కేలా ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
ఏదైనా కారణంతో రైలు గమ్యస్థానానికి ఆలస్యంగా చేరుకుంటే సమయాన్ని బట్టి ఒక్కో ప్రయాణికుడికి రూ.100 నుంచి రూ.250 వరకు పరిహారం ఇస్తారు. ఈ విషయాన్ని సాక్షాత్తు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.