ఒక ప్రైవేటు సంస్థ ఉద్యోగి (51) చాన్నాళ్లుగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య కాస్త ఎక్కువకావడంతో వారం క్రితం హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. రూ.3 లక్షలకు బీమా ఉందని చెప్పగా, అది చెల్లుబాటు కాదని, నగదు చెల్లిస్తేనే చేర్చుకుంటామని ఆసుపత్రి వర్గాలు తేల్చిచెప్పాయి. కరోనా అనుమానంతో చికిత్స మొదలెట్టిన వైద్యులు, ఐసీయూలో ఉంచి ఆక్సిజన్ అందించారు. రోజుకు రూ.85 వేలు బిల్లు వేశారు. పరీక్షల్లో కొవిడ్ నెగిటివ్ అని తేలడం, ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం ఆయన్ను సాధారణ వార్డులోకి మార్చారు. ‘‘ఆరు రోజుల చికిత్సకు రూ.3 లక్షలు కట్టించుకుని, ఇకపై రోజుకు రూ.60 వేలు కట్టాలన్నారు. చెల్లించిన సొమ్ముకు రశీదు అడిగినా ఇవ్వలేదు. తెలిసిన వారి ద్వారా చెప్పిస్తే మొత్తం బిల్లులో 30 శాతానికి రశీదు ఇవ్వడానికి అంగీకరించారు’’ అని బాధితుడు వాపోయారు.
‘బిల్లు ఎంత వేస్తే అంతా కట్టాల్సిందే. రశీదు మాత్రం మేమిచ్చిందే తీసుకోవాలి’. కొవిడ్ కష్టకాలంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు అనుసరిస్తున్న తీరిది. అడ్డగోలుగా బిల్లులు వసూలు చేయడమే కాకుండా, చెల్లించిన సొమ్ముకు కాగిత రూపంలో ఆధారాలు ఇవ్వకుండా బాధిత కుటుంబాలను కొన్ని ‘కాసుపత్రులు’ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడులకు దిగుతున్నారు. అడ్డగోలు బిల్లులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం, సర్కారు చర్యలకు ఉపక్రమిస్తుండటంతో కొన్ని ప్రైవేటు దవాఖానాలు ఈ కొత్త దందాకు తెరతీశాయి. ఇలాంటి పోకడలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా లెక్కచేయడం లేదు.
2 రోజుల్లోనే 200 ఫిర్యాదులు
మంగళ, బుధవారాల్లోనే అధిక బిల్లుల వసూలు, ఎక్కువ సొమ్ము తీసుకుని, తక్కువ మొత్తానికి రసీదులు ఇవ్వడం వంటి ఉదంతాలపై 200కి పైగా ఫిర్యాదులు రావడం ఇందుకు నిదర్శనమే. ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లుల దందాపై ఫిర్యాదు చేయాలంటూ ప్రభుత్వం ‘91541 70960’ వాట్సప్ నంబరు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి గత 20 రోజుల్లోనే సుమారు 2 వేలకుపైగా ఫిర్యాదులు అందడం గమనార్హం.
ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యారోగ్యశాఖకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
- దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి(55) కొండాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యుణ్ని సంప్రదించాడు. కరోనా లక్షణాలున్నాయనే సందేహముందని, ఆసుపత్రిలో చేరాలని వైద్యుడు సలహా ఇచ్చాడు. ఓపీలో స్వాబ్ తీసుకోవాల్సిందిగా కోరగా, ఆసుపత్రిలో చేరితేనే స్వీకరిస్తామనే నిబంధన విధించారు. ఆసుపత్రిలో విడి గదిలో పడక కేటాయించి, దగ్గు, జ్వరం మందులు వాడారు. మూడురోజుల తర్వాత ‘కొవిడ్ నెగెటివ్’గా తేలిందని చెప్పి రూ.లక్ష బిల్లు వేశారు.
- కొవిడ్ లక్షణాలతో సోమాజిగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తి నుంచి నమూనాలు స్వీకరించారు. వారం గడిచినా ఫలితాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు చికిత్స కొనసాగిస్తూ రోజుకు రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు.
- ఏ రోగానికి చికిత్స అందిస్తున్నారనే స్పష్టత కూడా ఇవ్వడం లేదంటూ కుటుంబ సభ్యులు తాజాగా ఫిర్యాదు ఇచ్చారు.
- వైరస్ సోకిన మహిళ సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరగా, నాలుగు రోజుల్లోనే రూ.2 లక్షలు వసూలు చేశారు.
- కరోనా అనుమానంతో మాదాపూర్‌లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి నాలుగు రోజుల చికిత్స అనంతరం చనిపోయాడు. రూ.3.5 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేశాయి.
- బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా బాధితునికి నాలుగు రోజులు చికిత్స చేసి రూ.4.5 లక్షలు వసూలు చేశారు. రశీదు ఇవ్వలేదు.
- కొవిడ్ సోకిన వ్యక్తి బంజారాహిల్స్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స పొందాడు. ప్రైవేటు బీమా ఉన్నా చేరినప్పుడే బయానాగా రూ.50 వేలు కట్టించుకుని, రూ.3.85 లక్షల బిల్లు వేశారు.
- హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నాలుగు రోజుల ఫ్లూ చికిత్సకు రూ.2.93 లక్షలు బిల్లు వేశారు. ఇదేమని నిలదీస్తే రూ.93వేలు తగ్గించారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.