freelancing jobs: ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాల వైపు నగర యువత మొగ్గు చూపుతున్నారు.మహమ్మారి దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు దీని ద్వారానే ఉపాధి పొందుతున్నారు. ఇంటి నుంచే ఒకేసారి విభిన్న వేదికలపై పనులు చేసుకునే అవకాశం ఉండండంతో చాలా మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నియామకాల్లో భాగ్యనగరం ముందంజలో ఉంది.
పనికి తగిన పైసలు
freelancing jobs in hyderabad: ప్రైవేటు సంస్థల్లో ఇచ్చే నెలజీతానికి ఎంత పని చెబితే అంత చేయాల్సి ఉంటుంది. కానీ, ఫ్రీలాన్సింగ్‌లో పనికి నిర్దిష్టమైన చెల్లింపులుంటాయి. ఓ రోజులో 20 పుటల్ని అనువాదం చేయాల్సి ఉంటే దాని వరకే జీతాన్ని పొందొచ్చన్న మాట. ఆన్‌లైన్‌లో ఇలా డైలీ వర్క్ వేదికలు చాలానే ఉన్నాయి. ఇందులోనూ సాంకేతిక నైపుణ్యమున్నవారికే ప్రాధాన్యం. కోడర్లు, ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు మంచి డిమాండ్ నడుస్తోంది. 69% నియామకాలు సాంకేతిక నేపథ్యం ఉన్నవారికే దక్కుతుండగా.. వాటిలో 40% ఫ్రీలాన్సర్లే ఉంటున్నారని ఓ ప్రైవేటు సంస్థ అధ్యయనంలో తేలింది.
ఈ రంగాల్లో..
freelancer jobs: టెలీకాలర్లు, డీటీపీ, డేటాఎంట్రీ, టీచింగ్, ట్యూటరింగ్ వంటి వాటితో పాటు సాంకేతికతాధారిత రంగాల్లో ఈ ఉపాధి ఎక్కువ ఉంది. బ్లాక్‌చైన్ ఇంజినీర్లు, ఐఓటీ ఆర్కిటెక్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఏఐ ఇంజినీర్లు, ఫుల్‌స్టాక్ డెవలపర్లు, క్లౌడ్ ఆర్కిటెక్టులు, డేటా సైంటిస్టులు కనీసం ఏడాదికి రూ. 15లక్షల నుంచి రూ.20లక్షల ప్యాకేజీలతో పనిచేస్తున్నారు. అడోబ్, ఒరాకిల్, ఆక్సెంచర్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థలు సహా ఈకామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్, మీషో తదితరాల్లోనూ ఈ ఫ్రీలాన్సర్లు భారీగా చేరుతున్నారు.