Private Degree Colleges In Telangana: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు సీట్ల భర్తీకి విద్యార్థులకు రకరకాల ప్రలోభాలను ఎరవేస్తున్నాయి. నగరాలు, పాత జిల్లా కేంద్రాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు బాగానే ఉన్నా మండల, నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని కళాశాలల్లో సీట్లు నిండటం లేదు. ఫలితంగా ప్రవేశాల కోసం పోటీపడుతున్నాయి. ఇందుకోసం కరీంనగర్, సూర్యాపేట లాంటి జిల్లాల్లో కొన్ని కళాశాలలు పీఆర్‌ఓలను నియమించుకున్నాయి. ‘ప్రభుత్వ కళాశాలల్లో ట్యూషన్ ఫీజు లేకున్నా పరీక్షల రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మా కళాశాలలో చేరితే మూడేళ్ల ఫీజు మేమే చెల్లిస్తాం. హాజరు తక్కువైనా చూసుకుంటాం. రూ.5 వేల వరకూ ఇస్తాం’ అంటూ కొన్ని కళాశాలలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ప్రాంగణ నియామకాలనూ కల్పిస్తామని, బస్టాండ్ నుంచి కళాశాలల వరకు బస్సులో ఉచితంగా తీసుకొస్తామనీ చెబుతున్నారు.
ఎందుకిలా..?
విశ్వవిద్యాలయాలు, కోర్సులను బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఫీజు ఉంది. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి బోధనా రుసుములు వస్తాయి. సీట్లు ఖాళీగా ఉండే బదులు ఒక ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థులకు ఇచ్చినా.. రెండేళ్ల ఫీజు తమకు వస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయని ఓ కళాశాల యజమాని తెలిపారు.
సీట్లు 4.80 లక్షలు.. విద్యార్థులు 2.97 లక్షల మందే..
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఈ ఏడాది 2.97 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో మరో 50 వేల మందికిపైగా పాసవుతారని అంచనా. ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మరో 14,910 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే సుమారు 3.60 లక్షల మందికి డిగ్రీ స్థాయి కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఉంటుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ఏటా సుమారు 85 వేల మంది చేరుతున్నారు. అంటే.. మిగిలిన 2.75 లక్షల మందిలో 2.50 లక్షల మంది డిగ్రీల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 50 వేల మంది, 51 గురుకుల డిగ్రీ కళాశాలల్లో 15 వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు.
ఈ ఏడాది మరికొన్ని గురుకుల డిగ్రీ కళాశాలలు వచ్చే అవకాశముంది. విచిత్రమేమిటంటే డిగ్రీ కళాశాలల్లో మొత్తం సీట్లు 4.80 లక్షలు ఉన్నాయి. ఇంటర్‌లో పాసైన వారందరూ చేరినా సీట్లు మిగిలిపోతాయి. అందుకే తమ కళాశాలల్లో సీట్ల భర్తీకి ప్రైవేట్ యాజమాన్యాలు ప్రలోభాల గాలం వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 980 వరకు ఉన్నాయి. ‘‘2012-13లో ఒక కాలేజీకి అవకాశం ఉన్నచోట మూడు నాలుగు కళాశాలలకు అనుమతి ఇచ్చారు. 364 కొత్త కళాశాలలు మంజూరయ్యాయి. ఆ ప్రభావం ఇప్పుడు అనారోగ్యకర పోటీకి దారితీసింది’’ అని రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ వ్యాఖ్యానించారు. కళాశాలల ప్రలోభాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రిని సంప్రదించగా.. తమకు ఇప్పటివరకు ఫిర్యాదులు అందలేదని తెలిపారు. విద్యార్థులను ప్రలోభపెట్టి ప్రవేశాలు తీసుకున్నారని తేలితే అలాంటి కాలేజీల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఒప్పందం కుదిరాక కిరికిరి ఎందుకు?.. రుణ సంస్థల తీరుపై కేసీఆర్ ఫైర్!