రామగుండం ఎరువుల కర్మాగారం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు... ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా జాతీయ నేత లక్ష్మణ్ సహా... రాష్ట్రప్రభుత్వం తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ప్రధాని రాష్ట్రానికి రావటం ఈ ఏడాదిలో నాలుగోసారి. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ఒకటిన్నరకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.... విమానాశ్రయం బయట భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన స్వాగతసభలో పాల్గొంటారు. 20నిమిషాలపాటు ప్రసంగిస్తారని ఆ పార్టీవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రధాని పర్యటన, బేగంపేటలో స్వాగత సభ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అనంతరం హెలికాప్టర్లో రామగుండం చేరుకొని... అక్కడ పునరుద్ధరించిన ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఖాయిలాపడ్డ పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 6వేల 3వందల 33కోట్లు వెచ్చించాయి. నీమ్కోటెడ్ యూరియా ఉత్పత్తి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం... రోడ్డు మార్గాన ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానానికి ప్రధాని చేరుకోనున్నారు. మొత్తం 20 వేల మంది వరకు హాజరయ్యే సభా ప్రాంగణం నుంచి మూడు జాతీయ రహదారులకు శంకుస్థాపన, భద్రాచలం రోడ్-సత్తుపల్లి నూతన రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగాన్ని వినేందుకు రైతులతోపాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆర్ఎఫ్సీఎల్ , ఎన్టీపీసీ ఉద్యోగుల కుటుంబాలు హాజరుకానున్నాయి. రామగుండంలో మోదీ బహిరంగ సభను ప్రజలు తిలకించేందుకు 75అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరలను ఏర్పాటు చేశారు. ఎరువుల కర్మాగార ప్రాధాన్యత... రైతులకు సమకూరే ప్రయోజనాలను వివరించడమే కాకుండా... నాలుగు కొత్త జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యానారాయణ తెలిపారు.