PM Modi Telangana Tour: సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ రైలును.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 19న ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తొలిసారి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. తొలుత సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడవనున్న వందే భారత్ రైలును... ఆ తర్వాత విశాఖ వరకూ పొడిగించే అవకాశాలున్నాయని సమాచారం. 699కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్‌నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వందే భారత్ రైలులో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సుమారు నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది.
వందేభారత్ రైలును ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్‌నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 699 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భవానాల్ని కూల్చి... అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో కొత్తగా నిర్మిస్తారు. గుత్తేదారు ఎంపిక గత ఏడాది అక్టోబరులోనే పూర్తయింది. రైల్వేశాఖ దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్లను పునరభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న మొదటి స్టేషన్ సికింద్రాబాద్. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే ఉంది.