తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచి ఆ మార్గాల్లో పరుగులు పెట్టనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

MMTS 2nd PHASE will be open in Secundrabad: ప్రయాణికుల అవసరాలను గుర్తించి.. వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 20 ఏళ్ల క్రితం మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం తీసుకొచ్చింది. దీనికి రెండు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా రెండో దశ ఎంఎంటీఎస్​ ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ 20 ఏళ్లలో ఎంఎంటీఎస్​ రైళ్లలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నగరం విస్తరించడంతో వీటిలో ప్రయాణించే వారు పెరిగారు. సుదూర ప్రాంతాలకు వెళ్లడం కష్టమైపోతున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్​ రెండో దశ ప్రారంభించనున్నారు. మరి ఈ రెండో దశ పూర్తిస్థాయిలో ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుంది..? ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి..? ఇప్పుడు చూద్దాం.

The second phase of MMTS is about to start
ఎంఎంటీఎస్​ రెండో దశ ప్రారంభంకానున్నది

By

Published : Apr 7, 2023, 3:13 PM IST

రేపటి నుంచి ఆ మార్గాల్లో పరుగులు పెట్టనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

MMTS 2nd PHASE will be open in Secundrabad: దక్షిణ మధ్య రైల్వే నిరుపేద, మధ్య తరగతి ప్రయాణికుల కోసం ఎంఎంటీఎస్​ రైళ్లను ప్రవేశపెట్టింది. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలవుతుంది. 2003లో అప్పటి ఉప ప్రధాని ఎల్​కే అడ్వానీ చేతుల మీదుగా ఎంఎంటీఎస్​ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఎంఎంటీఎస్​ రైళ్లను ప్రారంభించిన కొత్తలో ఆరు కోచ్‌లు, 30 సర్వీసులు నడిచేవి. వీటిలో నిత్యం 25 వేల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. కాలానుగుణంగా ఎంఎంటీఎస్​ సర్వీసులను 121కి పెంచారు. ఒక్కో రైలులో 12 కోచ్‌లను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ సమయంలో సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఎంఎంటీఎస్​ రైళ్లు కేవలం షెడ్డుకే పరిమితమయ్యాయి.

సుమారు 5000 మంది ప్రయాణించవచ్చు: కొత్త ఎంఎంటీఎస్​లో మహిళలకు, చిన్న పిల్లలకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే ప్రతి కోచ్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయి. పాత ఎంఎంటీఎస్​ రైళ్లలో 700ల మంది కూర్చుని.. 2 వేల మంది నిల్చుని ప్రయాణిస్తున్నారు. కొత్త ఎంఎంటీఎస్​ రైళ్లలో 1150 మంది కూర్చుని.. 4 వేల మంది నిల్చుని ప్రయాణించే అవకాశముంది. కొత్త ఎంఎంటీఎస్​ రైళ్లలో ఎల్​ఈడీ బోర్డులు, మైక్‌లో రాబోయే స్టేషన్ల వివరాలను కూడా వెల్లడించే ఏర్పాటును తీసుకొచ్చారు. ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేందుకు సౌకర్యవంతమైన సీట్లను కూడా ఏర్పాటు చేశారు. నిల్చుని ప్రయాణించే ప్రయాణికుల కోసం హ్యాంగర్స్ కూడా ఉన్నాయి.

సాంకేతికంగా ప్రత్యేక ఏర్పాట్లు: మహిళా ప్రయాణికులు ప్రయాణించే బోగీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బోగీలను విశాలంగా రూపొందించారు. కిటికీలకు జాలీలను ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా ప్రయాణికులకు పెద్ద పీట వేశామని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్​ రైళ్లు సికింద్రాబాద్-నాంపల్లి, సికింద్రాబాద్-ఫలక్​నుమా, ఫలక్​నుమా-లింగంపల్లి మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. కొత్త ఎంఎంటీఎస్​ రైళ్లను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన రంగులలో తీర్చిదిద్దారు. అలాగే అత్యాధునిక సాంకేతికతో కూడిన బ్రేకింక్ విధానంతో పాటు, తరచూ ఇంజిన్ల మరమ్మతులు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ మార్గాల్లో ప్రయాణించనుంది: నూతనంగా ప్రారంభించే రైళ్లు మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్, మేడ్చల్-సికింద్రాబాద్-తెల్లాపూర్ మధ్య ఎంఎంటీఎస్​ రైళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో లాలాగూడ గేట్, మల్కాజ్ గిరి, దయానందనగర్, సఫిల్ గూడ, ఆర్​కేపురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్ల పోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ చెబుతోంది.
రెండో దశ ఎంఎంటీఎస్​ ఎన్ని కిలోమీటర్లు: రెండో దశలో ఎంఎంటీఎస్​ మొత్తం 84.5 కిలోమీటర్ల వరకు ఉంది. ఇందులో మౌలాలి-ఘట్కేసర్, ఫలక్‌నుమా-ఉందానగర్, సికింద్రాబాద్-బొల్లారం, బొల్లారం-మేడ్చల్ పనులు పూర్తయ్యాయి. బొల్లారం-మౌలాలి, మౌలాలి-మల్కాజ్ గిరి మధ్య డబ్లింగ్ పనులు, ఎలక్ట్రిఫికేషన్ పనులు కొనసాగుతున్నాయి. తెల్లాపూర్-రామచంద్రాపురం మధ్య పనులు పూర్తై అందుబాటులోకి కూడా వచ్చింది. హైదరాబాద్‌కు నిత్యం లక్షల మంది వచ్చి వెళ్తుంటారు. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌తో సిటీలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు నెలకొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఎంఎంటీఎస్​ రెండో దశ కీలకం కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details