Primary Agricultural Cooperative Societies: రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుంటే సగం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇంతకాలం వరిధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొంటున్నందున సొసైటీలు రైతుల నుంచి కొని అప్పగించి కమీషన్ రూపంలో ఆదాయం పొందుతున్నాయి. గతేడాది వరకూ పరిమితంగా మొక్కజొన్నలను రాష్ట్ర ప్రభుత్వం కొనమంటే ఈ సంఘాలు కొని కమీషన్ పొందేవి. ఈ ఏడాది గత వానాకాలంలో మక్కలు కొనలేదు.
- ప్యాక్స్‌కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏమైనా ఇవ్వాలంటే ఏటా ఆడిట్ తప్పనిసరి. 2020-21 ఆదాయ, వ్యయాలపై 2021 సెప్టెంబరు 30కల్లా ఆడిట్ పూర్తిచేయాల్సి ఉన్నా, 80 సంఘాల్లో ఆడిట్ పూర్తికాలేదు. పలు సంఘాల్లో రికార్డులు తారుమారు చేస్తున్నారని, అందువల్ల కంప్యూటరీకరణలో ఆడిట్ కావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.
- వ్యవసాయ పనుల్లో రైతులకు సేవలందించడం అనే ప్రధాన బాధ్యతను కొన్ని సంఘాలు వదిలేశాయి. వరి ధాన్యం కొంటే కమీషన్ వస్తుందని పోటీపడుతున్న సంఘాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతులకు విక్రయించడానికి ముందుకు రావడం లేదు.
- సాగు పనులకు అవసరమయ్యే ఆధునిక యంత్రాలను సహకార సంఘం కొని‘యంత్రాల సేవా కేంద్రం’ ఏర్పాటుచేసి వాటిని రైతులకు నామమాత్రపు అద్దెకివ్వాలని కేంద్రం పదే పదే చెబుతోంది. కానీ గత మూడేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా ఈ కేంద్రం ఏర్పాటుకాలేదు.
- కొవిడ్ విపత్తులో రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకం కింద రాష్ట్రానికి రూ.3 వేల కోట్లు కేటాయించారు. దీనినుంచి ఒక్కో సహకార సంఘానికి రూ.2 కోట్ల రుణం ఒకశాతం వడ్డీకే ఇవ్వాలని నాబార్డు సూచించింది. ఎక్కువ సంఘాలు ఈ రుణానికి దరఖాస్తులైనా ఇవ్వలేదు. మంచిర్యాల జిల్లాలో 20 సంఘాలకు ఒక్కటే దరఖాస్తు చేసింది.
- మహబూబాబాద్ జిల్లాల్లో 19 ప్యాక్స్ ఉండగా గతంలో అవకతవకలు జరిగినందున మల్యాల సంఘం మూతబడింది. ఇక బయ్యారం సంఘంలో ఆడిట్ లెక్కలు తేలలేదు.
నిధులు తిన్నారు... బిల్లులివ్వలే...
మెదక్ జిల్లా చిన్నఘనాపూర్‌లో సంఘంలో పాలకవర్గం అక్రమాలకు సీఈఓ సహకరించడం లేదని ఆయన కుర్చీ తీసేసి కూర్చోవడానికి చోటు లేకుండా చేశారు. ఖర్చుపెట్టిన సొమ్ము లెక్కల విషయంలో సీఈఓ, పాలకవర్గం మధ్య వివాదం మొదలైంది. సంఘం ఖాతా నుంచి రూ.8.18 లక్షలు తీసుకుని సొంతానికి వాడుకున్న సొమ్ముకు ఆడిట్ చేయించడానికి బిల్లులు ఇవ్వాలని సీఈఓ అడగ్గా ‘నీకెందుకు చెప్పాలి’ అంటూ పాలకవర్గం ఎదురుతిరిగింది. ఇంతవరకూ బిల్లులు ఇవ్వలేదు.ఆడిట్‌కు పాలకవర్గం సహకరించడం లేదని సీఈఓ సత్యనారాయణ మెదక్ కలెక్టర్‌కు, జిల్లా సహకార అధికారి (డీసీఓ)కి కూడా ఫిర్యాదుచేశారు. ఇదే జిల్లా రాంపూర్ సంఘంలో ఇలాగే నిధుల దుర్వినియోగం జరగడంతో అక్కడి పాలకవర్గాన్ని రద్దుచేశారు.
- గత ఆర్థిక సంవత్సరపు ఆదాయ, వ్యయాలపై ఆడిట్ పూర్తిచేసి డీసీఓకు సంఘాలు నివేదికలివ్వాలి. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే పాలకవర్గాలపై సహకార చట్టం ప్రకారం వేటు తప్పదని సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య ‘ఈనాడు’కు చెప్పారు. ఆడిట్ అభ్యంతరాలుంటే డీసీఓలు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.