దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా సమయంలో పాత్రికేయులకు అండగా ఉండి సాయం అందించామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గత ఎనిమిది నెలలుగా కొవిడ్ దృష్ట్యా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయని.. జీవన విధానం మీద కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో పురపాలక సిబ్బంది, పోలీసులు, వైద్యులతో సమానంగా పాత్రికేయులు కూడా ధైర్యంగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. కాకపోతే.. వారిని ప్రభుత్వం కరోనా వారియర్స్‌గా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాత్రికేయులకు అండగా ఉన్నాం : అల్లం నారాయణ - మీడియా అకాడమీ
కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 34 కోట్ల నిధులపై వచ్చిన వడ్డీతో కరోనా బారినపడ్డ జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. 1603 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వారికి రూ. 3.12 కోట్ల ఆర్థిక సాయం అందించామని అల్లం నారాయణ పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
కరోనా బారినపడిన 1603 మంది పాత్రికేయులకు రూ.3.12 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు వెల్లడించారు. మీడియా అకాడమీ ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిన 1517 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.3.03 లక్షల అందజేశామన్నారు. హోం క్వారంటైన్లో ఉన్న 86 మందికి రూ10 వేల చొప్పున 8.60 లక్షలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు. మొత్తంగా సంక్షేమ నిధి నుండి 1603 మంది జర్నలిస్టులకు ఇప్పటి వరకు 3.12 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. జర్నలిస్టులకు మరింత సాయం అందించేందుకు పాత్రికేయుల సంక్షేమ నిధికి మరికొంత బడ్జెట్ కేటాయించాలని త్వరలో ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: తలసాని