జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 7న చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్ జలవిహర్‌లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ చెక్కులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం... మృతి చెందిన 75 జర్నలిస్టుల కుటుంబాలకు రూ.ఒక లక్ష, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన 15 మంది జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని... మూడు ఆర్థిక సంవత్సరాల్లో జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.34 కోట్ల 50 లక్షలు విడుదల అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 260 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.ఒక లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశామని వెల్లడించారు. ఆయా కుటుంబాలకు ప్రతి నెల రూ.3వేల చొప్పున పింఛన్‌ను ఐదేళ్ల పాటు అందజేస్తున్నామన్నారు. వారి కుటుంబాల్లో పదో తరగతి వరకు చదివే 145 మంది పిల్లలకు నెలకు రూ.వెయ్యి చొప్పున ట్యూషన్ ఫీజును అందజేస్తున్నామన్నారు.