Telangana Formation Day 2022 : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ... రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వంతో తెలంగాణ వెల్లివిరిస్తోందని రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి సూచీలో అద్భుతమైన పురోగతి సాధిస్తోందని తెలిపారు. పరిశ్రమలకు కేంద్రంగా మారిన తెలంగాణ... మరింతగా ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
'తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వంతో ఆశీర్వదించబడిన తెలంగాణ... అభివృద్ధి సూచికలలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను.' -- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
తెలుగులో ప్రధాని ట్వీట్...
తెలంగాణ సంస్కృతి ప్రపంచ ప్రఖ్యాతి పొందిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన పీఎం... తెలంగాణ ప్రజల శ్రేయస్సుకై తాను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
'రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా... నా తెలంగాణ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్థిస్తున్నాను.' -- నరేంద్ర మోదీ, ప్రధాని
ఆకాంక్షల నుంచే తెలంగాణ: రాహుల్
తెలంగాణ కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నిస్వార్థంగా పనిచేసినందుకు గర్విస్తున్నానని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని... రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన... మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుంచి తెలంగాణ పుట్టినట్లు చెప్పారు. ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ నిబద్ధతను పునరుద్ఘాటించాలనుకుంటునట్లు రాహుల్ పేర్కొన్నారు. చారిత్రాత్మక రోజున అమరవీరులు, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందామన్న రాహుల్‌గాంధీ... గత 8 ఏళ్ల తెరాస హయాంలో తెలంగాణ దారుణమైన పాలనను చవిచూసినట్లు విమర్శించారు.
'తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసోదరీమణులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం. మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ప్రజల వాణిని విని తెలంగాణ కలను సాకారం చేసేందుకు నిస్వార్థంగా పనిచేసినందుకు గర్విస్తున్నాను.' -- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత
ఇదీ చూడండి: