మహనీయుల జీవిత గాధలను, విజయాలను మార్గ దర్శకం చేసుకుని యువత ముందుకు సాగాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారత తొలి ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా బషీర్ బాగ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
'కరోనా సాకుతో మహాత్ముల జన్మదిన వేడుకలను రద్దు చేయడం సరికాదు' - బీసీ సంక్షేమ సంఘం తాజా వార్తలు
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జగ్జీవన్ రామ్ 113 వ జయంతి సందర్భంగా బషీర్ బాగ్లోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కరోనా సాకుతో రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని విమర్శించారు.
అణగారిన వర్గాలు గర్వపడే భరతమాత ముద్దబిడ్డ బాబు జగ్జీవన్ రామ్ అని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. దశాబ్దాలుగా పేద ప్రజల ప్రేమాభిమానాలను ఆయన పొందారని గుర్తు చేశారు. మహనీయుల జయంతి వేడుకలను కరోనా సాకుతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించకుండా రద్దు చేయడం దారుణమన్నారు. బార్లు, సినిమా థియేటర్లను నిర్వహించుకునేందుకు యధేచ్చగా అనుమతులు ఇస్తున్న అధికారులు మిగతా విషయాలపై ఎందుకు అంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే మహనీయలు పుట్టినరోజున అధికారికంగా నిర్వహించాలని... లేని పక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.