High court: రాష్ట్ర హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు నూతనంగా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి గతంలో సిఫారసు చేసింది.
నూతనంగా నియామకైన న్యాయమూర్తుల్లో న్యాయవాదుల కోటా నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, ఎన్.వి. జువ్వాడి శ్రీదేవి, ఎన్.వి శ్రావణ్‌కుమార్ ఎంపికయ్యారు. అదే విధంగా న్యాయాధికారుల కోటా నుంచి జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున్ ఉన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(1)కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి వీరి నియామకాలకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న క్రమంలో వారి సీనియారిటీ వర్తిస్తుందని, బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వారి నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ పదిమంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ వీరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. వీరి నియామకంతో మొత్తం సంఖ్య 29కి చేరుతుంది. హైకోర్టులో ఒకేసారి పదిమంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి.
న్యాయవాదుల కోటానుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన చాడ విజయభాస్కర్ రెడ్డి, మీర్జా సైఫుల్లా బేగ్‌ల పేర్లు తాజా నియామక ఉత్తర్వుల్లో కనిపించలేదు. ఇప్పుడు నియమితులైన వారిలో మహిళలు నలుగురు ఉన్నారు. దీంతో ఈ హైకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10కి చేరనుంది. మొత్తం న్యాయమూర్తుల్లో మహిళల శాతం 34.48%కి పెరుగుతుంది.
న్యాయవాదుల నుంచి...
కాసోజు సురేందర్:మహబూబ్‌నగర్‌కు చెందిన కె.ప్రమీలాదేవి, కె.లక్ష్మీనారాయణ దంపతులకు 1968లో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను, బీఎస్సీ, న్యాయశాస్త్రం డిగ్రీలను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తి చేశారు. 1992 డిసెంబరు 15న బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. నాలుగు పర్యాయాలు సీబీఐ న్యాయవాదిగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, ఎన్‌ఐఏల ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, కేంద్రం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. కింది కోర్టులతోపాటు హైకోర్టులో పలు క్రిమినల్, ఆర్థిక నేరాల, ఏసీబీ, సీబీఐ కేసులతోపాటు సివిల్, క్రిమినల్, రాజ్యాంగానికి సంబంధించిన వాటిల్లో వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్ బాంబు పేలుళ్లు, లుంబినీ పార్కు పేలుళ్లు, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన కేసులు, టెర్రరిస్ట్ హార్బరింగ్ కేసుల్లో ప్రత్యేక కోర్టుల్లో వాదనలు వినిపించారు. రూ.7 వేల కోట్ల కుంభకోణానికి చెందిన సత్యం కేసులో వాదనలు వినిపించగా ప్రత్యేక కోర్టులో నేరం రుజువై నిందితులకు జైలు శిక్ష పడింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు.
సూరేపల్లి నంద:సికింద్రాబాద్‌కు చెందిన నంద బి.దానప్ప, మీరాలకు 1969 ఏప్రిల్ 4న జన్మించారు. భర్త ఎస్.మాధవరావు. బి.ఎ., ఎల్‌ఎల్‌బీ చేసిన ఆమె 1993 ఆగస్టు 4న బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. 28 ఏళ్లపాటు పలు రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, కార్మిక, రెవెన్యూ, సర్వీసులకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించారు. న్యాయసేవాధికార సంస్థ లీగల్ ఎయిడ్ ప్యానెల్ న్యాయవాదులకు తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 2000 సంవత్సరం నుంచి బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా వ్యవహరించారు. కేంద్రం తరఫున న్యాయవాదిగా పనిచేశారు. నిమ్స్, కార్పొరేషన్ బ్యాంక్‌ల పక్షానా వాదనలు వినిపించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగారు. లా జర్నళ్లకు రిపోర్టర్‌గా పనిచేశారు. 2010లో న్యాయసేవల విభాగం నుంచి ఆచార్య చాణక్య సద్భావన పురస్కారం పొందారు.
ముమ్మినేని సుధీర్ కుమార్:ఖమ్మం జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు,భారత లక్ష్మి దంపతులకు 1969 మే 20న జన్మించారు. చర్ల ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి ఏలూరు సర్ సీఆర్‌రెడ్డి కాలేజీలో డిగ్రీ చేశారు. నాందేడ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మరట్వాడ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొంది 1994లో బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. అన్ని విభాగాల్లోని కేసుల్లో హైకోర్టులో వాదనలు వినిపించారు.
జువ్వాడి శ్రీదేవి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జువ్వాడి సూర్యారావు, భారతిలకు 1972 ఆగస్టు 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. నిర్మల్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, 2018 నుంచి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు. భర్త కె.శ్రీహరిరావు కూడా న్యాయవాదే.
శ్రావణ్‌కుమార్ వెంకట్:మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు. పీవీ పెద్ద కుమార్తె శారద, సిద్దిపేట జిల్లా గుగ్గిళ్ల గ్రామానికి చెందిన నచ్చరాజు వెంకటకిషన్‌రావు దంపతులకు 1967 ఆగస్టు 18న జన్మించారు. ఉస్మానియా నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ, మేశ్రా రాంచి బిట్స్ నుంచి ఎంబీయే చేశారు. 2005 నవంబరు 17న బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. సిటీ సివిల్ కోర్టు, ఎన్‌సీఎల్‌టీలతోపాటు హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. సివిల్ కేసులతోపాటు టాక్స్, కంపెనీలా, ఆర్బిట్రేషన్ వంటి వాణిజ్య విభాగాల్లోని కేసుల్లో నైపుణ్యం సాధించారు.