President Draupadi Murmu Comments : ఏ రంగంలోనైనా ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు.. ఈటల రాజేందర్, డి.కె.అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి విద్యార్థులతో మాట్లాడారు.
మన విశిష్ఠ సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి మరవొద్దని సూచించారు. గ్రామమైనా, ఏజెన్సీ అయినా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని అన్నారు. గ్రామం, గిరిజన ప్రాంతం నుంచి వచ్చామనే ఆత్మనూన్యతను రానీయొద్దని తెలిపారు. సంస్కృతి పరిరక్షణ హక్కును కూడా రాజ్యాంగం మనకు కల్పించిందని గుర్తు చేశారు.
''మన దేశంలో ప్రతి ఊరికి గ్రామదేవత రక్షణగా ఉంటుంది. మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే విలువలు నేర్పాలి. మన రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించింది. అన్ని విషయాలను అమెరికాతో పోల్చుకోవద్దు.'' - ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి