President Draupadi Murmu at Dundigal Air Force Academy : దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆమెకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి రాజ్ భవన్‌కు చేరుకున్నారు.
ఇవాళ రాత్రి రాష్ట్రపతి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం బేగంపేట నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుంటారు. ప్రి కమిషన్డ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఎయిర్ పోర్స్‌కు చెందిన పలు విభాగాల క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొంటారు. ఈ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ఆమె రివ్యూయింగ్ అధికారిగా ఉండనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు పట్టాలు అందించడంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పతకాలు బహుకరించనున్నారు.
ఇందులో భాగంగా క్యాడెట్లకు శిక్షణ ఇచ్చిన పలు ఎయిర్ క్రాప్ట్‌లను ఆమె తిలకించనున్నారు. పలు కార్యక్రమాలను సైతం ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఉదయం 11.15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి దిల్లీకి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో బస దృష్ట్యా పరిసర ప్రాంతాల్లో బలగాలు విధుల్లో ఉన్నాయి.