రాష్ట్ర ఆదాయంపై ఆర్థిక మాంద్యం నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అనుకున్న మేర ఆదాయం ఉండడం లేదు. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చినప్పటి నుంచి మారిన పరిస్థితులు ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవాళ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్... ఓట్ ఆన్ బడ్జెట్ కంటే తగ్గనుంది. మాంద్యం పరిస్థితులు రాష్ట్ర రాబడులపై మున్ముందు మరింత ఎక్కువవుతాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తగ్గిన పన్ను రాబడులు...
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి మినహా అన్ని పన్ను రాబడులపై ప్రతికూల ప్రభావం మొదలైంది. ఖజానాకు కీలకమైన అమ్మకం పన్ను ఆదాయం తగ్గింది. జీఎస్టీ రాబడుల్లో సగటున ఏటా 17 శాతం వృద్ధి రేటు కొనసాగుతుండగా ఈసారి 12 నుంచి 14 శాతం మధ్యే ఉంటుందని ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖల అధికారులు విశ్లేషిస్తున్నారు. మద్యం అమ్మకాల ఆదాయం కూడా ఆర్నెల్ల కాలంలో తగ్గవచ్చనే అంచనాలున్నాయి. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా గ్రాంట్ ఇన్ ఎయిడ్ల తగ్గుదల కూడా బడ్జెట్ను ప్రభావితం చేస్తోంది.