ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్, మరొకరు గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇటీవల విచారించిన ఏపీ హైకోర్టు... ఎస్ఈసీకి నోటీసులిచ్చింది. రమేశ్‌కుమార్ మంగళవారం అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికలపై అభిప్రాయ సేకరణకు వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీకి... 19 పార్టీలను ఆహ్వానించగా... 11 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు. 2 పార్టీలే రాతపూర్వకంగా అభిప్రాయం తెలియచేస్తామని చెప్పాయన్నారు. 6 పార్టీలు హాజరు కాకపోగా.. సమావేశ బహిష్కరణకు వైకాపా నిర్ణయించుకుందని వివరించారు. మార్చిలో ఇచ్చిన ఎన్నికల ప్రకటన ఆధారంగా నిర్వహించిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఎన్నికల రద్దుకు అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఎస్ఈసీ తన కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపారు.
ఎస్ఈసీకి అవసరమైన వనరులు సమకూర్చాలని... ఎన్నికల కమిషన్‌కు భద్రత పెంచాలని తన అఫిడవిట్‌లో రమేశ్‌కుమార్ కోరారు. తొలి దశ ఎన్నికల ప్రక్రియ అనుభవాల దృష్ట్యా ఎస్ఈసీ ఆందోళనలో ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూనే తన అధికారాలను అమలు చేసేందుకు ఎస్ఈసీ నిర్ణయించుకుందని తెలిపారు. గతంలో తప్పుచేసిన ఉన్నతాధికారులపై సిఫారసు చేసినా... ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. ఇప్పటికే జరిగిన ఉల్లంఘనల దృష్ట్యా కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందని...బిహార్‌లో ఎన్నికలు జరుగుతుండగా.... తెలంగాణలోనూ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు.