రాష్ట్రంలో కందుల కొనుగోలుకు మార్గం సుగమమైంది. కేంద్రం విధించిన ఆంక్షల నేపథ్యంలో రైతులకు మేలు జరిగేలా త్వరలోనే కందులు కొనుగోలు చేసేందుకు... రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య సన్నాహాలు చేస్తోంది. 2020-21 ఖరీప్ సీజన్‌లో తొలిసారిగా నియంత్రిత పంట సాగు విధానంలో కంది సాగు విస్తీర్ణం బాగా పెరిగింది.
130 కేంద్రాల ఏర్పాటు...
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 84 వేల 541 ఎకరాల విస్తీర్ణంలో కందిని సాగుచేశారు. పంట విస్తీర్ణం ఆధారంగా 8.20 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ దశలో కొనుగోళ్ల కోసం సిద్ధంగా ఉన్న టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థ 28 జిల్లాల్లో 130 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
కేంద్రం కేవలం 77 వేల మెట్రిక్ టన్నులు కందులు కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల అదనపు కొనుగోలుకు అనుమతివ్వాలంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, నాఫెడ్ సీఎండీలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లేఖలు రాశారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని ఆశాభావంతో ఉన్నామని టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థ ఛైర్మన్ మార గంగారెడ్డి పేర్కొన్నారు.