తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం... ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం - Telangana mlc elections

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సుదీర్ఘంగా ఈ కౌంటింగ్ జరగనుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలింగ్‌ నమోదు, ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు, జంబో బ్యాలెట్‌ పత్రాల దృష్ట్యా పూర్తి ఫలితం తేలేందుకు సుదీర్ఘ సమయం పట్టనుంది.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం... ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం... ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం

By

Published : Mar 17, 2021, 4:53 AM IST

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం...

సాధారణ ఎన్నికలను తలపించేలా ఈనెల 14న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ కౌంటింగ్‌ సరూర్​నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 3 లక్షల 57 వేల 354 ఓట్లు పోలయ్యాయి.

ఎంత సమయం పడుతుందో..

సాధారణ ఎన్నికల్లో అయితే ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజేతగా ప్రకటిస్తారు. కానీ పట్టభద్రుల ఎన్నికల లెక్కింపు విభిన్నంగా ప్రాధాన్యతా ఓట్ల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. పైగా పెరిగిన పోలింగ్‌ శాతం, జంబో బ్యాలెట్‌ పత్రాల కారణంగా లెక్కింపు ప్రక్రియ అధికారులకు సవాల్‌గా మారింది. కౌంటింగ్‌కు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

రెండ్రోజుల సమయం!

పూర్తి ఫలితం తేలే వరకు రెండ్రోజులకు పైగా సమయం పట్టే అవకాశమున్నందున షిఫ్టుల వారీగా పనిచేసేందుకు అధికారులకు, సిబ్బందికి డ్యూటీలు వేశారు. ఇందులో భాగంగానే ఎన్నికల సంఘం కౌంటింగ్‌ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. 8 హాళ్లలో లెక్కింపు ప్రక్రియ చేపడుతుండగా... ఒక్కో హళ్లో 7 టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. వీటిపై 799 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను లెక్కిస్తారు.

ఒక్కో టేబుల్‌పై బ్యాలెట్‌ పత్రాలను ఉంచిన అనంతరం 25 బ్యాలెట్‌ పత్రాలకు ఒకటి చొప్పున కట్ట కడతారు. ప్రస్తుతం పోలైన ఓట్ల ప్రకారం ఒక్కో కట్ట కట్టడానికే అధిక సమయం పట్టే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైతే రాత్రి 8 గంటల వరకు కేవలం బ్యాలెట్‌ పత్రాలను కట్టలు చేసే ప్రక్రియ సాగే అవకాశం ఉంది.

ఏకకాలంలో 56 టేబుళ్లపై...

అనంతరం కట్టలుగా చేసిన బ్యాలెట్‌ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి.... చెల్లుబాటయ్యే ఓట్లను రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్‌ ఏజెంట్‌ల సమక్షంలో వేరు చేస్తారు. అప్పుడు మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ఇలా 56 టేబుళ్లపైనా ఏకకాలంలో ప్రక్రియ సాగుతుంది. ఇది సుమారు గంటన్నర సమయం పట్టే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.

తొలిరౌండ్...

రాత్రి తొమ్మిదిన్నర తర్వాతే తొలి రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. టేబుల్‌కు వేయి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారు. మొత్తం ఓట్లను లెక్కించడానికి దాదాపు పది గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. దీని ప్రకారం రెండో రోజు ఉదయానికి కానీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎలిమినేషన్...

ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు తేలకుంటే అంటే చెల్లుబాటయ్యే ఓట్లలో సగానిపైగా ఎక్కువ ఓట్లు ఏ అభ్యర్థికి రాకుండా ఉంటే అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. పోటీలో ఉన్న 93 మంది అభ్యర్థుల్లో ఎవరికి తక్కువగా వస్తే వారిని తొలగించి, అందులో నుంచి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే వారికి కలుపుతారు. ఇలా మ్యాజిక్ ఫిగర్ వచ్చే వరకు ఎలిమినేట్ చేసుకుంటూ వెళతారు.

ఓట్ల లెక్కింపునకు రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున 19 వరకు అధికారులు, సిబ్బంది కోసం అన్ని ఏర్పాట్లు లెక్కింపు కేంద్రం వద్దే చేశారు. కౌంటింగ్ హాల్‌లోకి వచ్చే ఏజెంట్లు సెల్‌ఫోన్లు గాని, పెన్ను, పుస్తకాలకు అనుమతిలేదు.

పోలీసుల బందోబస్తు...

కౌంటింగ్‌ దృష్ట్యా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద అదనపు బలగాలతో రాచకొండ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలు చేస్తూ... ఐదుగురు మించి గుమికూడవద్దని హెచ్చరికలు జారీచేశారు. సరూర్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బార్లు, మద్యం, కల్లు దుకాణాలు, స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులను లెక్కింపు పూర్తయ్యే వరకు మూతపడనున్నాయి.

ఇదీ చూడండి:నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు మోగిన నగారా...

ABOUT THE AUTHOR

...view details