తెలంగాణ

telangana

ETV Bharat / state

MEDICAL COLLEGES: కొత్త వైద్య కళాశాలలకు సన్నాహాలు.. రూ.18 కోట్లతో పడకల ఏర్పాటు - తెలంగాణ

రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్యకళాశాలలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. వీటి ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు సాగుతున్నాయి. తొలి ఏడాది తరగతుల కోసం ప్రస్తుత ఆస్పత్రి భవనాల పైభాగంలో గానీ, కళాశాలల కోసం సేకరించిన స్థలాల్లో గానీ తాత్కాలిక నిర్మాణాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యశాఖ నివేదిక సమర్పించింది. వ్యవధి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.

medical college
వైద్య కళాశాలలు

By

Published : Aug 2, 2021, 8:41 AM IST

రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్యకళాశాలలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. వీటి ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు సాగుతున్నాయి. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం, మంచిర్యాలల్లో ఏర్పాటు చేయనున్న వైద్యకళాశాలలకు అనుబంధంగా కచ్చితంగా 300 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలనేది జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధన. వీటిలో కేవలం సంగారెడ్డిలో మాత్రమే 400 పడకలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉంది. మిగిలిన వాటిలో నిబంధనలకు సరిపడా పడకలు లేవు. వీటిని 300 పడకల స్థాయికి పెంచాలంటే సుమారు రూ.18 కోట్ల ఖర్చవుతుందని వైద్యశాఖ అంచనా వేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచి వైద్యకళాశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. వ్యవధి తక్కువగా ఉన్నందున తొలి ఏడాది తరగతుల కోసం ప్రస్తుత ఆసుపత్రి భవనాల పైభాగంలో గానీ, కళాశాలల కోసం సేకరించిన స్థలాల్లో గానీ తాత్కాలిక నిర్మాణాలు చేపడతామని పేర్కొంది. కొత్త వైద్యకళాశాలల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఆరోగ్యశాఖ నివేదికను సమర్పించింది.

కొత్తగా 1050 ఎంబీబీఎస్‌ సీట్లు

రాష్ట్రంలో కొత్తగా 7 వైద్యకళాశాలలు ఏర్పాటైతే, ప్రస్తుతం ఉన్న తొమ్మిది కళాశాలలు 16కు పెరుగుతాయి. ఇప్పుడున్న 1640 ఎంబీబీఎస్‌ సీట్లకు అదనంగా 1050 వైద్యసీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో వైద్యకళాశాలలో 150 ఎంబీబీఎస్‌ సీట్లు రానున్నాయి. ఎన్‌ఎంసీ కొత్త వైద్యకళాశాలల దరఖాస్తులను వచ్చే నెల (సెప్టెంబరు) నుంచి స్వీకరించనున్నందున రాష్ట్రం తరఫున దరఖాస్తు చేయనున్నారు. కొత్త కళాశాలల వసతుల పరిశీలనకు ఈ ఏడాది నవంబరులో ఎన్‌ఎంసీ ప్రతినిధులు వస్తారు. ఆ లోగా తాత్కాలిక నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వైద్యశాఖ పేర్కొంది.

ఒక్కో కళాశాలకు 97 పోస్టులు

ఎన్‌ఎంసీ బృందం తనిఖీ సమయానికి ఒక్కో వైద్యకళాశాలలో 97 మంది ఉద్యోగులను భర్తీ చేయాలని వైద్యశాఖ తెలిపింది. ఇందులో ఆచార్యులు ఆరుగురు, సహ ఆచార్యులు 17, సహాయ ఆచార్యులు 31, ట్యూటర్లు/డెమాన్‌స్ట్రేటర్లు 17, సీనియర్‌ రెసిడెంట్లు 26 మంది చొప్పున నియమించాల్సిన అవసరముందని పేర్కొంది. తొలి ఏడాది వైద్యవిద్యలో ప్రధానంగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీకి సంబంధించిన బోధకులు అవసరం. వీరి నియామకం సవాలేనని, ప్రస్తుత ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ ఈ విభాగాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. ఈ కళాశాలల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే తాత్కాలిక/శాశ్వత వైద్యులకు 25 శాతం అదనపు ప్రోత్సాహక వేతనాన్ని అందజేయాలని సూచించింది. ఒక్కో వైద్యకళాశాలకు శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడానికి నిబంధనల ప్రకారం 20 ఎకరాలు అవసరం. జగిత్యాల, మంచిర్యాలలో మినహా మిగిలిన 5 చోట్ల కూడా ఒకేచోట 20 ఎకరాల భూమి లభ్యమైంది. ఆ రెండు చోట్ల భూసేకరణపై మరోసారి దృష్టి పెట్టాల్సి ఉందని వైద్యశాఖ తన నివేదికలో తెలిపింది.

ఇదీ చూడండి:2023లో పీజీ వైద్య కోర్సులకు ప్రవేశ పరీక్ష!

ABOUT THE AUTHOR

...view details