దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోసం నీట్ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లుగానే.. నర్సింగ్ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష చేపట్టేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు ఇంటర్ మార్కులను ప్రాతిపదికగా పరిగణనలోకి తీసుకుంటుండగా.. ఇక నుంచి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించి, అందులో మార్కులు, ర్యాంకుల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లోనూ నర్సింగ్ కళాశాలల్లో ప్రవేశాలను నిర్వహిస్తారు.
నీట్ తరహాలో నర్సింగ్ ప్రవేశ పరీక్ష..!
నర్సింగ్ విద్యలో నూతన మార్పులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. వైద్యవిద్యలో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్న మాదిరిగానే.. నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
ప్రస్తుతమున్న ‘జాతీయ నర్సింగ్ మండలి’(ఐఎన్‌సీ) స్థానంలో ‘జాతీయ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్’ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1947 జాతీయ నర్సింగ్ మండలి బిల్లును సవరిస్తూ నూతన నర్సింగ్ కమిషన్ బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై వచ్చేనెల 6వ తేదీ లోపు ప్రజలు, నిపుణులు, మేధావులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను nnmcbill-mohfw@nic.in ఈ మెయిల్‌కు పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ జనరల్(నర్సింగ్) డాక్టర్ రాతి బాలచంద్రన్ కోరారు.
ఎగ్జిట్ పరీక్ష తప్పనిసరి
ప్రస్తుతం ఏ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేస్తే.. ఆ రాష్ట్రంలో నర్సింగ్ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. తాజా బిల్లు జాతీయ స్థాయిలో తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకుగాను జాతీయ స్థాయిలో ‘ఎగ్జిట్’ పరీక్ష రాయాలి. ఇందులో మార్కులు, ర్యాంకుల ప్రాతిపదికనే ఎంఎస్సీ నర్సింగ్ విద్యలోనూ ప్రవేశాలు కల్పిస్తారు. కమిషన్ అమల్లోకి వచ్చిన తర్వాత.. మూడేళ్లలోపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను తీసుకొస్తారు. ఐదేళ్లలో ‘జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పరీక్ష’ను అమలు చేస్తారు.