రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. పంటలు చేతికొచ్చే దశలో కురుస్తున్న వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి నేలకొరిగి ధాన్యం నేలరాలింది. మరికొన్నిచోట్ల ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోనూ వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈదురుగాలులతో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ఐనవోలు కక్కిరాలపల్లిలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పసుపు, మిర్చి, మొక్కజొన్న తడిసింది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలాయి.
కరీంనగర్ జిల్లాలో..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం రైతులను నష్టాల పాలుచేసింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసింది. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తపల్లికి చెందిన సుమారు 60 మంది రైతుల ధాన్యం వాననీటితో కాకతీయ ప్రధాన కాలువలో కొట్టుకుపోయింది.