మాయదారి కరోనా.. మానవ లోకాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రసవం కోసం ఓ నిండు గర్భిణి సుమారు 460 కిలోమీటర్లు.. ప్రయాణించాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. ఏపీ, తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఓ గర్భిణి (23)కి నెలలు నిండడంతో.. ప్రసవం కోసం ఓ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొవిడ్ పరీక్ష చేయించుకుని రావాలని అక్కడి వైద్యులు సూచించారు. పరీక్షలో పాజిటివ్ అని తేలడంతో ఆపరేషన్‌కు అక్కడి వైద్యులు నిరాకరించారు. అమలాపురం, కాకినాడలోని అన్ని ఆసుపత్రులు తిరిగి అలసిపోయినా ఆమెను చేర్చుకోవాడానికి.. చివరకు ఓ కార్పొరేట్ ఆసుపత్రి ముందుకొచ్చింది.
గర్భిణికి అనస్తీషియా ఇచ్చినా మత్తు రావడం లేదని గుర్తించిన వైద్యులు రక్త పరీక్షలు జరిపారు. రక్తంలో సీఆర్‌పీ స్థాయి ఎక్కువ ఉందంటూ.. ప్రసవం చేయలేమని చేతులెత్తేశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కుటుంబీకులు హుటాహుటిన రూ.80 వేలు కట్టి ఓ అంబులెన్స్‌లో మంగళవారం ఉదయాన్నే హైదరాబాద్‌కు వచ్చారు. తాము చికిత్స చేయలేమంటూ అక్కడి వైద్యులు.. ఆ మహిళను మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.