తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలేం చూస్తున్నారు.. పెద్దలేం చేస్తున్నారు? - Increased internet usage with online classes

ఆన్‌లైన్‌ తరగతుల వల్ల ఇంటర్‌నెట్‌ వాడకం అనివార్యమైంది. గతంలో పిల్లలకు ఫోన్లు, కంప్యూటర్లు ఇచ్చేందుకు వెనుకాడిన తల్లిదండ్రులు... ఇప్పుడు ఇష్టంలేకపోయినా కాదనలేని పరిస్థితి. ఏమరుపాటుగా ఉండే చిన్నారులకు ఇది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. అశ్లీలం... ఆన్‌లైన్‌ ఆటలు... స్నేహాల పేరుతో సామాజిక మాధ్యమాల మాటున పొంచి ఉన్న మేకవన్నె పులులకు చిన్నారులు లక్ష్యంగా మారుతున్నారు. అంతర్జాలంలో అవసరానికి మించి ఉన్న సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇప్పుడు కత్తిమీద సాము.

cyber
పిల్లలేం చూస్తున్నారు.. పెద్దలేం చేస్తున్నారు?

By

Published : Dec 30, 2020, 9:47 AM IST

పిల్లలు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు వాడుతున్నారంటే... వారు ఏం చూస్తున్నారో అనే ఆందోళన తల్లిదండ్రుల్ని వేధిస్తూంటుంది. ఎందుకంటే అంతర్జాలంలోకి వెళ్లగానే ఏదో ఒక రూపంలో అశ్లీలం పలకరిస్తుంది. పొరపాటుగా దాన్ని క్లిక్‌ చేస్తే ఆ తర్వాత అన్నీ అలాంటి దృశ్యాలే పదేపదే వస్తుంటాయి. పిల్లలు ముఖ్యంగా కుర్రకారు ఇలాంటి సైట్లు చూడటం మొదలుపెడితే అది అలవాటై చివరికి వ్యసనమవుతుంది. తల్లిదండ్రులు ప్రతిక్షణమూ వారిని గమనిస్తూ కూర్చోవడం సాధ్యంకాదు. ఒకవేళ ప్రతిదాన్నీ అనుమానిస్తుంటే పిల్లలు అపార్థం చేసుకునే ప్రమాదమూ లేకపోలేదు.

ఆట మాటున వేట

ఈ తరం పిల్లల్లో ఎక్కువగా ఆన్‌లైన్‌ ఆటల్లో మునిగితేలుతున్నారు. కరోనా కారణంగా కాలు బయటపెట్టే వీల్లేక ఫోన్‌, కంప్యూటర్లో ఆటలకే పరిమితం అవుతున్నారు. ఇది శ్రుతిమించితే ప్రమాదం. అంతర్జాలం ఆటలు పిల్లల్లో హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయి. క్రమంగా వారిని బెట్టింగ్‌కు అలవాటు పడేలా చేస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతూ... ఆన్‌లైన్‌ ఆటలు మొదలుపెట్టి, బెట్టింగ్‌కు అలవాటు పడి రూ.8 లక్షలు పోగొట్టుకున్నాడు. గతంలో బ్లూవేల్‌ ఆటకు అలవాటు పడ్డ పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలూ ఉన్నాయి.

సామాజిక మాధ్యమాలతో చేటు

ఫేస్‌బుక్‌ స్నేహాలు.. వాట్సప్‌ బృందాలు... ట్విటర్‌ పలకరింపులు... ఇన్‌స్టాగ్రాంలో వయ్యారాలు.. ఈ కాలపు యువత కాలక్షేపం అంతా సామాజిక మాధ్యమాల్లోనే. నేరగాళ్లు వీటి మాటున చెలరేగుతున్నారు. దిల్లీలో 11వ తరగతి చదివే పిల్లలు ‘బాయ్స్‌ లాకర్స్‌ రూం’ పేరుతో అసభ్య సందేశాలు పంచుకున్న ఉదంతం ఎంత సంచలనమో తెలిసిందే. ఫేస్‌బుక్‌ వేదికగా జరుగుతున్న మోసాలకూ అంతులేదు. అవతలి వ్యక్తి ఎవరో తెలియకుండా మొదలవుతున్న స్నేహం అనర్థాలకు దారితీస్తోంది. అమ్మాయిల ఫొటోలతో ఛాటింగ్‌ మొదలుపెడుతున్న మోసగాళ్లు ఉచ్చు బిగించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

నేరాలు.. అంతేలేని ఘోరాలు

మాల్‌ వెర్టిసింగ్‌

అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలు అంతర్జాలంలో అందుబాటులో ఉంటున్నాయి. చదవాలనే ఆసక్తితో కొన్నింటిని తెరవగానే కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ చొరబడుతుంది. ఇది కంప్యూటర్‌ కార్యకలాపాల్ని నేరస్థులకు చేరవేయడమే కాదు.. బ్యాంకు ఖాతాల సమాచారాన్నీ చోరీ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన కంప్యూటర్‌లో గూఢచారి దాక్కున్నట్లే.

సైబర్‌ స్టాకింగ్‌

ఆన్‌లైన్లో మారుపేరుతో స్నేహం చేస్తూ... మహిళలను లైంగికంగా వేధించడమే సైబర్‌ స్టాకింగ్‌. ఈ తరహా నేరగాళ్లు మహిళల ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ ఐడీలు సేకరించి ఇబ్బంది పెడతారు. విద్యార్థినులు, ఉద్యోగినులు దీని బారిన పడుతున్నారు.

సైబర్‌ టీజింగ్‌

సూటిపోటి మాటలతో వేధించడం టీజింగ్‌. అదే ఆన్‌లైన్లో చేస్తే సైబర్‌ టీజింగ్‌. అనేక మంది ఇప్పుడు ఆన్‌లైన్లో టీజింగ్‌కు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా వేధిస్తున్నారు. తల్లిదండ్రులకు చెబితే ఏమనుకుంటారో అనే భయంతో వారు తమలో తామే కుమిలిపోతుంటారు.

క్యాట్‌ ఫిషింగ్‌

మారుపేరుతో మోసానికి పాల్పడటం క్యాట్‌ ఫిషింగ్‌. ఈ తరహా నేరగాళ్లు మారుపేర్లు, ఫొటోలతో ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌ పెట్టుకుంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొంతకాలం స్నేహితులుగా నటిస్తారు. తర్వాత తమకు ప్రమాదం జరిగిందని, ఇంట్లో వాళ్లకు తీవ్ర అనారోగ్యం వచ్చిందని డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తుంటారు. నెటిజన్లకు ఇలాంటి అనుభవాలు కొత్తకాదు. వీరు ఎప్పుడూ ఫోన్‌ కాల్స్‌కు, వీడియోకాల్స్‌కు స్పందించరు.

డాక్సింగ్‌

ప్రముఖ వ్యక్తులు, సంస్థలను రకరకాలుగా వేధించడమే డాక్సింగ్‌. సంస్థలు, వ్యక్తుల కంప్యూటర్లలోకి చాటుగా చొరబడుతున్న నిందితులు కీలక సమాచారం తస్కరిస్తున్నారు. దాన్ని అంతర్జాలంలో పెడుతూ పరువు తీస్తున్నారు. అడిగినంత డబ్బు చెల్లించకపోతే ఇంకా ముఖ్యమైన సమాచారం బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు.

సైబర్‌ బుల్లీయింగ్‌

60 శాతం మంది యువత సైబర్‌ బుల్లీయింగ్‌ బారిన పడుతున్నారు. ఎదుటి వారిని కలచివేసేలా, మానసికంగా దెబ్బతీసేలా పోస్టులు పెట్టడమే సైబర్‌ బుల్లీయింగ్‌. పిల్లలు సామాజిక మాధ్యమాల్లో కొత్త వ్యక్తులతో స్నేహం మొదలుపెడతారు. నేర ప్రవృత్తి గల వ్యక్తులు పరిచయాలు పెంచుకొని మొదట్లో స్నేహం నటించి క్రమంగా తీవ్రనేరాలు, అశ్లీల పోస్టులు పెడుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటారు.

స్వాటింగ్‌

ఫలానా వ్యక్తి సంఘ విద్రోహశక్తి. అతని దగ్గర మారణాయుధాలో, మాదకద్రవ్యాలో ఉన్నాయని పోలీసులకు సమాచారమిచ్చి ఇబ్బందులకు గురి చేయడమే స్వాటింగ్‌. గిట్టని వారిని లక్ష్యంగా చేసుకొనే నేరమిది.

వీడియో ఛాట్‌తో మోసం

రకరకాల పద్ధతుల్లో ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్న నేరగాళ్లు అందమైన అమ్మాయిలతో మాట్లాడిస్తున్నారు. కొద్దిగా పరిచయం కాగానే వీడియోకాల్‌లో ఛాటింగ్‌ చేద్దామని ముగ్గులోకి దింపుతారు. అందుకు సిద్ధమవగానే రెచ్చగొట్టేందుకు వీడియో కెమెరా ముందే నగ్నంగా మారిపోతారు. మాటలతో మభ్యపెట్టి ఎదుటివారినీ నగ్నంగా మారాలంటూ కవ్విస్తున్నారు. లొంగిపోతే.. ఇక అయిపోయినట్లే. ఆ వ్యవహారమంతా రికార్డు చేస్తారు. వెంటనే బేరం మొదలుపెడతారు. ‘మీ నగ్న వీడియోలు, చిత్రాలు మా దగ్గర ఉన్నాయి, వాటిని నెట్‌లో పెడతాం, కావాలంటే చూడు’ అంటూ ఓ లింక్‌ పంపుతున్నారు. అది తెరవగానే యువకుడి నగ్న దృశ్యాలు ఉంటాయి. ఈ వీడియోలు బయట పెడతామంటూ బెదిరించి డబ్బు గుంజుతున్నారు.

ముందు జాగ్రత్తే.. మందు

నెట్‌ వల్ల మంచితో పాటు అజాగ్రత్తగా ఉంటే వచ్చే అనర్థాలపైనా అవగాహన ఉండాలి. లేకపోతే పెంచుకోవాలి. పిల్లలు, తల్లిదండ్రులు ముందుచూపుతో వ్యవహరించడమే నష్టాల నుంచి తప్పించుకునే ఏకైక మార్గం. - ప్రసాద్‌ పాటిబండ్ల, క్రైం త్రెట్‌ అండ్‌ డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ఎనలిస్ట్‌, సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, న్యూదిల్లీ

  • పిల్లలు తమ గదుల్లో కాకుండా అందరూ తిరిగే చోట, కలిసి కూర్చునే ప్రాంతాల్లో కంప్యూటర్లు వాడేలా చూడాలి. చాటుమాటు నెట్‌ వాడకాన్ని నిరోధించాలి.
  • టీనేజీ పిల్లలకు అంతర్జాలం వల్ల ఒనగూరే ప్రయోజనాలు, జరుగుతున్న నష్టాలపై నిర్మాణాత్మకంగా చెప్పాలి. గట్టిగా అరవడం, కేకలు వేయడం సరికాదు.
  • వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టకుండా చూడాలి. ఫొటోలు పంపవద్దు. వీడియో ఛాటింగ్‌ చేయకూడదు.
  • బ్యాంకు ఖాతాలు, పిన్‌ నంబర్లు, క్రెడిట్‌ కార్డుల వివరాల వంటి కీలక సమాచారం కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవద్దు.
  • ఆన్‌లైన్‌ నేరాల బారిన పడటమే కాదు పిల్లలూ నేరాలకు తెగించే అవకాశం ఉంది. వారిపై ఓ కన్నేసి ఉంచాలి.
  • ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు ఉన్న వీడియో కెమెరాలను ఆఫ్‌ చేయాలి. అవసరమైనప్పుడే వాడుకోవాలి.
  • మాల్‌వెర్టిసింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే అంతర్జాలంలో కనిపించిన పుస్తకాలన్నీ తెరవకూడదు. ప్రాచుర్యం పొందిన సంస్థలకు చెందిన వాటిపైనే ఆధారపడాలి.

ABOUT THE AUTHOR

...view details