AP prc steering committee leaders : ఏపీలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలపై పీఆర్సీ సాధన సమితి నేతలు స్పందించారు. ఉద్యమంలోకి అందరం కలిసి వచ్చామని.. ఇలాంటి క్రమంలో కుటుంబ సభ్యులను దూషించడం ఉపాధ్యాయులకు సరికాదన్నారు. పీఆర్సీ జీవోల్లో ఇచ్చిన వాటికి.. తాము సాధించిన వాటికి తేడా చూడాలన్నారు. వచ్చే ఏడాది మళ్లీ కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పుకుందని గుర్తు చేశారు. మాతోపాటే పొరుగుసేవల ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయని.. 27 శాతం ఫిట్‌మెంట్ సాధనకు ఉద్యమిస్తే తామంతా స్వాగతిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులకు తగదు - సూర్యనారాయణ
"శవయాత్రలు చేయడం ఉపాధ్యాయులకు తగదు. మా వల్లే నష్టపోయామనడం ఉపాధ్యాయ సంఘాలకు సరికాదు. గొప్ప పీఆర్సీ ఇచ్చామని ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చాం కనుకే 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చారు. మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా. ఫిట్‌మెంట్ అనేది సీఎం ఇష్టమని ఫ్యాప్టో నేతలు చెప్పలేదా? సీఎం వద్దకు వెళ్లి డైరీలు ఆవిష్కరింపజేసుకున్నారు. రాజకీయ కారణాలతో బురద జల్లడం మానాలని విజ్ఞప్తి" - సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
బురద జల్లడం సరికాదు - వెంకట్రామిరెడ్డి
ఫిట్‌మెంట్ తప్ప మిగతా డిమాండ్లన్నీ సాధించామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఐఆర్ రికవరీ ఉండదని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. తమపై బురద జల్లడం ఉపాధ్యాయ సంఘాలకు సరికాదని వ్యాఖ్యానించారు.
ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలు..
పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) అధ్యక్షుడు సుధీర్‌బాబు, ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్) ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్)-1938 అధ్యక్షుడు హృదయరాజు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను సాధన సమితి స్టీరింగ్ కమిటీ కాపాడలేకపోయిందన్నారు. తమ రాజీనామాలను ఐకాస ఛైర్మన్లకు పంపించామని వెల్లడించారు. పీఆర్సీ ఫిట్‌మెంట్, ఇతర ప్రయోజనాల సాధనకు పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు.
స్టీరింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మంత్రుల కమిటీతో చర్చలు జరగలేదని, ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, గ్రాట్యుటీ, అదనపు క్వాంటం పింఛన్, సీపీఎస్ రద్దులాంటి ముఖ్యమైన అంశాలపై సాధన సమితి నాయకత్వం పట్టుబట్టలేదని విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆరోపించారు. ముఖ్యమైన అంశాలలో స్పష్టమైన నిర్ణయాలు రాబట్టలేకపోయామని తెలిపారు. ‘చలో విజయవాడ’ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు విజయవంతం చేశారని, సాధన సమితి నేతలు మాత్రం నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి, ప్రభుత్వం వద్ద అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మంత్రుల కమిటీ చర్చలకు హాజరైనట్లు సంతకాలు చేసిన కాగితాన్ని చూపించి, ఒప్పందాన్ని అంగీకరించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సరికాదన్నారు. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకే నష్టమని వెల్లడించారు. కలిసొచ్చే సంఘాలతో పీఆర్సీపై ప్రత్యేక ఉద్యమం చేపట్టనున్నామని చెప్పారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం, ఇతర సంఘాల వారు ఇప్పటికే మద్దతు తెలిపారని గుర్తు చేశారు.
ఇదీ చూడండి :Tummala Nageshwararao Comments: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర కామెంట్స్