జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాయలసీమకు చెందిన శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను ముఠా ఈ అపహరణకు పాల్పడినట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు... వారిని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
ఖాకీ దుస్తులు
ఆదాయపన్ను అధికారులుగా అవతారమెత్తిన కిడ్నాపర్లు... వాటికి కావాల్సిన దుస్తులను ఫిలింనగర్లోని ఓ డ్రామా డ్రెస్ కంపెనీలో అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలో ఓ వ్యక్తి ఖాకీ దుస్తులు ధరించాడు. ఈ మేరకు డ్రామా డ్రెస్ కంపెనీలో సీసీ దృశ్యాలను కూడా సేకరించారు. ఐటీ అధికారులమని నమ్మించి ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడిన గుంటూరు శ్రీను ముఠా... తెలివిగా ముగ్గురిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మూడు వాహనాలు
ముగ్గురు సోదరులను మొదట విచారణ పేరుతో వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు వాహనాల్లో ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పుతూ చివరికి మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. అక్కడ కొన్ని దస్త్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారు.